కరన్‌కోట్: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన, నాణ్యమైన, క్రమశిక్షణ, క్రీడల్లో ప్రతిభతో పాటు అనేక సదుపాయాలతో విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర మానవవనరులశాఖ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా 595 నవోదయ విద్యాలయాలు ఉండగా, తెలుగు రాష్టాల్లో 24 ఉన్నాయి. ఈ విద్యాలయాలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) సిలబస్‌లో విద్యా బోధనలు అందిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించినా కేవలం విద్యపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో తమ పిల్లలు రాణించలేకపోతున్నారనే అపోహ తల్లిదండ్రుల్లో నెలకొంది. కాగా నవోదయ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తుండటంతో ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి వందల సంఖ్యలో మాత్రమే ఉన్న ప్రవేశాలకు వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సీటు లభించాలని వేచి చూస్తుంటారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రవేశానికి తాజాగా నవోదయ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యాలయాల్లో 2018–19 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రిజర్వేషన్ల పద్ధతి ద్వారా విద్యార్తులకు ప్రవేశపరీక్ష నిర్వహించి ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. వచే ఏడాది ఫిబ్రవరి 10న జరిగే ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.దీనికై వచ్చేనెల నవంబర్ 25లోగా దరఖాస్తులు చేసుకోవాలి.
అర్హతలు, రిజర్వేషన్ విధానం..
నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. వీరు 2005 మే1 నుంచి 2009 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. 3, 4, 5వ తరగతులను విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతలలో చదివి ఉత్తీర్ణులవ్వాలి. నవోదయ విద్యాలయలో ప్రవేశానికి రిజర్వేషన్ విధానం పక్కాగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు.షెడ్యూల్ కులాలకు 15,షెడ్యూల్ తరగతులకు 7,వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.బాలికలకు 33శాతం అమలుచేస్తున్నారు.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు..
గతంలో విద్యార్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని తీసుకుని మాన్యువల్ చేతిరాత ద్వారా నింపి అదే కార్యాలయంలో స మర్పించేవారు. కాగా ఆ విధానంలో పలు ఇబ్బదులు ఎదురవుతున్నాయని గుర్తించి కేంద్రీయ నవోదయ విద్యాలయ అధికారులు ఈ విద్యాసంవత్సరం నుంచి తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. సమీ పంలోని మీసేవ కేంద్ర నుంచి రూ.10 చెల్లించి ఆన్‌లైన్ ద్వా రా దరఖాస్తు పత్రం తీసుకొని విద్యార్థి చదివే పాఠశాల ప్రధనోపాధ్యాయుడి సంతకాన్ని తీసుకోవాలి.ప్రవేశ పరీక్ష దరఖాస్తు కోసం మరో రూ.35 చెల్లించి విద్యార్థి పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జత చేసి పూరిత వివరాలు నింపాలి. ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లో డ్ చేయగానే సంబంధిత ఫోన్‌కు వచ్చిన వోటీపీ నమోదు చేయగానే దరఖాస్తు స్వీకరించినట్లు నిర్ధారణ అవుతుంది.
ప్రవేశ పరీక్ష విధానం..
నవోదయ ప్రవేశ పరీక్షను ఏభాషలోనైనా రాయవచ్చు. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను ఎంచుకోవచ్చు. 2 గంటల సమయం కేటాయించే ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. మూడు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. మేధాశక్తికి 50, గణితం 25 మూడో విభాగంలో 25 మార్కులకు భాష సంబంధిత ప్రశ్నలు ఉంటాయి.
పోటీ తీవ్రమే అయినా..
నవోదయ విద్యాలయలో ప్రవేశం కోసం ఏటా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 12 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతారు. కాగా ప్రణాళిక బద్ధంగా చదువుకుని పరీక్షకు సిద్ధమైతే ఫలితాలు సాధించవచ్చు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఉన్న గణిత అంశాలపై సాధన చేయాలి.అలాగే ప్రవేశ పరీక్ష బుక్‌లెట్‌లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా ఆయా అంశాలపై దృష్టిసారిస్తే పరీక్షలో నెగ్గడం ఎంతో సులభం. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బంగారు బాటకు భరోసా సాధించినట్టే.
Comments
Please login to add a commentAdd a comment