
33 డీఎడ్ కాలేజీల్లో ప్రవేశాల్లేవు
వెబ్‌సైట్‌లో పేర్కొన్న డీఎడ్, బీఎడ్ కాలేజీల్లోనే చేరాలి: ఎన్‌సీటీఈ
ఈ నెల 18 నుంచి వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్య కాలేజీలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కొరడా ఝలిపించింది. 33 డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలతో పాటు మరో 15 వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో ఈ సారి ప్రవేశాలకు కోతపెట్టింది. నిర్ణీత సమయంలో కాలేజీల సమగ్ర సమాచారంతో కూడిన డేటాబేస్‌ను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని పేర్కొంది. విద్యార్థులు కాలేజీల్లో చేరేటప్పుడు ఆ కాలేజీ డేటాబేస్‌కు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేసిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకున్నాకే చేరాలని స్పష్టం చేసింది.153 కాలేజీల్లోనే ప్రవేశాలు: రాష్ట్రంలో ఉన్న 212 డీఎడ్ కాలేజీల్లో 8 కాలేజీలు క్లోజర్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 18 కాలేజీల్లో ఏ మీడియంలో కోర్సు నిర్వహిస్తారని విద్యాశాఖ లేఖలు రాసినా స్పందించలేదు. దీంతో వాటిని పక్కన పెట్టారు.
ఎన్‌సీటీఈకి సమాచారమివ్వని 33 కాలేజీలు సహా 59 కాలేజీలను పక్కన పెట్టారు. మొత్తం 153 కాలేజీల్లో ప్రవేశాలకు ప్రవేశాల కమిటీ ఆమోదం తెలిపింది. 18 నుంచి వెబ్ ఆప్షన్లు..: డీఈఈసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 11న ప్రారంభమైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 15తో ముగియనుంది. వెరిఫికేషన్‌కు హాజరైన విద్యార్థులకు ఈనెల 18 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. ఈసారి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 10,200 సీట్లు భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలేజీలు ఇచ్చిన ఆమోదం ప్రకారం ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో 600 ఇంగ్లిష్ మీడియం సీట్లు, తెలుగు మీడియంలో 7,750 సీట్లు , ఇతర మీడియంలో మరో 450 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. 10 ప్రభుత్వ డైట్‌లలో ఇంగ్లిష్ మీడియంలో 500 సీట్లు, తెలుగు మీడియంలో 500 సీట్లు, ఉర్దూ మీడియంలో 400 సీట్లు భర్తీ చేయనున్నారు.