
వరంగల్ ఎన్‌ఐటీ 372 సీట్లు తెలంగాణవే..
- ప్రవేశాల నిబంధనలను మార్చేందుకు ఏపీ పెద్దలు ఢిల్లీలో కుట్రలు చేస్తున్నారు
- తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లితే సహించం: కడియుం
హైదరాబాద్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో హోం స్టేట్ కోటా కింద తెలంగాణకు రావాల్సిన 50 శాతం సీట్లు (372) తెలంగాణవేనని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏపీ పెద్దలు ఢిల్లీలో కూర్చొని ఆ సీట్లకు కోత పెట్టే కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇందుకు తాము ఒప్పుకునేది లేదని, తెలంగాణ విద్యార్థుల హక్కులకు భంగం వాటిల్లితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల అవకాశాల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని వివరించారు. సోమవారం సచివాలయంలో కడియం మాట్లాడుతూ ఎన్‌ఐటీలో ప్రవేశాల నిబంధనలు మార్చేందుకు ఏపీ పెద్దలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దానికి తలొగ్గే సీట్ల కేటాయింపు వెబ్‌సైట్‌లో ఇదివరకు పెట్టిన ప్రవేశాల నిబంధనలు డౌన్‌లోడ్ కాకుండా చేసి, మళ్లీ అప్‌డేటెడ్ చేస్తామంటూ మెసేజ్‌ను పెట్టారని విమర్శించారు. ‘జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 371 (డి) వర్తించదు. అది పార్లమెంట్ చట్టమే చెబుతోంది... ఎన్‌ఐటీల్లో ప్రవేశాల నిబంధనలు చెబుతున్నాయి. వాటి ప్రకారం 50 శాతం సీట్లు హోమ్ స్టేట్ కోటా కింద తెలంగాణ విద్యార్థులవే. ఏపీకి వీటిల్లో హక్కు లేదు.
రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు, పదో షెడ్యూల్‌లోని విద్యా సంస్థల్లోనే పదేళ్ల పాటు కామన్ అడ్మిషన్ ప్రొసీజర్ అమల్లో ఉంటుందని విభజన చట్టం చెబుతోంది. ఇదీ జాతీయ స్థాయి విద్యా సంస్థలకు వర్తించదు. ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే ఎన్‌ఐటీలో స్టేట్ హోం కోటా కింద తక్కువ సీట్లు వస్తున్నందున వరంగల్‌లోని ఎన్‌ఐటీ సీట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు’ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కుట్రలను అడ్డుకుంటామని, అందుకే తాను ఈనెల 19న ఢిల్లీకి వెళ్తున్నట్టు చెప్పారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి మహంతితో మాట్లాడతానని, అవసరమైతే కేంద్రమంత్రి స్మృతి ఇరానీని కలుస్తానని కడియం వివరించారు.