నిట్లో 50% సీట్లు తెలంగాణ విద్యార్థులవే..
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక వరంగల్ నిట్లో 50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులవేనని, నిట్ అడ్మిషన్లకు 371డి వర్తించదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం కూడా అదే చెబుతోందని ఆయన మంగళవారం న్యూఢిల్లీలో అన్నారు. విద్యార్థులు నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నయం చూసుకోవాలని కడియం సూచించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 371-డి ఆర్టికల్ వర్తించబోదని చెప్పారు. రాష్ట్రంలోని సంస్థలకే 371-డి వర్తిస్తుందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ రాష్ట్ర సంస్థలకే వర్తిస్తుందని చెప్పారు. 371-డి వర్తించే సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అమలవుతుందన్నారు. పార్లమెంటు చట్టప్రకారం, ఎన్‌ఐటి ప్రవేశాల మార్గదర్శకాలు, న్యాయపరంగా ఏ రకంగా చూసినా 50 శాతం సీట్లు తెలంగాణకే దక్కుతాయని అన్నారు. సీట్లు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని చెప్పారు.
కాగా స్థానిక కోటాలోని 50 శాతం సీట్లు తమవేని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి అడ్మిషన్ ద్వారా సీట్లు భర్తీ చేసి ఏపీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను కోరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై చర్చించేందుకు కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లారు.