
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రజలను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. గత డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులు పెద్ద ఎత్తున సొమ్ము స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మరీ ఆ స్థాయిలో ప్రలోభాలు కొనసాగే అవకాశాలు లేకపోయినా.. పోలీసులు మాత్రం అప్రమత్తంగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువే అయినప్పటికీ.. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ పోరు కూడా హోరాహోరీగా జరుగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 400 చోట్ల తనిఖీలు..
రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, చెక్ పోస్టులతోపాటు దాదాపు 400 చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.7.2 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల విలువైన మద్యం, రూ. 2.3 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నిఘా వర్గాల సమాచారం మేరకు దాడులు చేస్తున్నారు. ఇటు సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్‌సెర్చ్‌లు చేపడుతున్నారు. హవాలా వ్యాపారంపైనా ఓ కన్నేశారు. లైసెన్స్‌డ్ ఆయుధాలు కలిగి ఉన్న వారు తమ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ఆర్మరీలు, పోలీస్‌స్టేషన్లలో డిపాజిట్ చేశారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 7,900 వరకు లైసెన్స్‌డ్ ఆయుధాలు డిపాజిట్ చేశారని అడిషనల్ డీజీ జితేంద్ర వెల్లడించారు.
13 రోజులు మరింత పకడ్బందీగా..
నామినేషన్లకు ఈ నెల 25వ తేదీనే ఆఖరు. ఉపసంహరణకు 28 వరకు గడువుంటుంది. 29 నుంచి ఇక ప్రచారపర్వం ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలోనే నిఘా, బందోబస్తు విషయంలో అవలంబించాల్సిన వ్యూహాలపై పోలీసులు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నారు. దాదాపు 13 రోజుల పాటు జరగనున్న ప్రచార కార్యక్రమాలు, సభలు కీలకం కానున్నాయి. ఈ రెండు వారాల్లో జరిగే అక్రమాలు, ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment