
సాక్షి,మహబూబాబాద్:ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అభ్యర్థులు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు.ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటించిన హామీలకు తోడుగా అభ్యర్థులు నియోజకవర్గ స్థాయి హామీలను జత చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటించే ముందు స్థానిక నేతలతో సమావేశమై అక్కడి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పైనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఏమైనా అడిగితే వాటికి సరైన సమాధానం చేప్పేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లా వెనుకబాటుకు గల కారణాలను చెబుతూ తాము గెలిస్తే పరిష్కారమార్గం చూపుతామని హామీ ఇస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర çప్రభుత్వాలు చేపట్టిన పథకాలను టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు చెబుతుండగా, కాంగ్రెస్ అధికార పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి మార్గాలపై మాటల యుద్ధం సాగిస్తున్నారు. చేసిన అభివృద్ధితో పాటు మళ్లీ అధికారం కట్టబెడితే మరింత అభివృద్ధి చేసి చూపుతామని అధికార పార్టీ నేతలు సవాల్ విసురుతున్నారు.
బయ్యారానికి ఉక్కు పరిశ్రమ
దీర్ఘకాలిక సమస్యలపై ఆయా పార్టీల అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మానుకోట పార్లమెంట్ పరిధిలో నెలకొన్న సమస్యలను అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార అస్త్రాలుగా మల్చుకుంటున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్న బయ్యారం ఉక్కుపరిశ్రమ సాధన మాతోనే సాధ్యమని హామీలు గుప్పిస్తున్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా మాతోనే సాధ్యమని అన్ని పార్టీల నేతలు వరాలు కురిపిస్తున్నారు. ములుగు గిరిజన యూనివర్సిటీకి అధిక నిధులు కావాలంటే అది మా పార్టీనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఏజెన్సీ మండలాల్లో నెలకొన్న పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపెడతాం అంటూ హామీలు గుప్పిస్తున్నారు.
బీజేపీ విజయసంకల్ప యాత్రలో కేంద్రమంత్రి పోడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పగా, మానుకోటలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రచార సభలో సీఎం కేసీఆర్ భూ సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు. అన్ని పార్టీలు ఒకేరకమైన హామీలను ఇస్తూ, గెలిస్తే అభివృద్ధి చేసి చూపుతామని నమ్మబలుకుతుండటంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఏదో సమస్యను తెరపైకి తేవడం, మరచిపోవడం నేతలకు పరిపాటిగానే మారుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు హామీలుగానే మిగులుతున్నాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక సమస్యలు తీరుస్తాం
లోక్‌సభ ఎన్నికలు అయినప్పటికీ అన్ని పార్టీలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలతో పాటు, స్థానికంగా నెలకొన్న సమస్యల పైనా కూడా అభ్యర్థులు ఫోకస్ చేస్తున్నారు. ఇవి పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు అదనం. ముఖ్యంగా వివిధ సంఘాల భవనాలు, రోడ్డు, మంచి నీటి పథకాలతో పాటు వ్యక్తిగత పథకాల ప్రస్తావన చేస్తున్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి హామీలిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment