‘సూర్య’ ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది... చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మంలో శనివారం రికార్డుస్థాయిలో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్: ‘సూర్య’ ప్రతాపానికి రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది... చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఖమ్మంలో శనివారం రికార్డుస్థాయిలో 48 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఏకంగా 7 డిగ్రీలు అధికం. ఖమ్మం చరిత్రలో ఇంత ఉష్ణోగ్రత రికార్డు అవడం ఇదే మొదటిసారి. 1947 మే 25న ఇక్కడ 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న మోదైంది. 68 ఏళ్ల తర్వాత ఆ రికార్డు తిరగరాస్తూ శనివారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక జిల్లాలోని కొత్తగూడెం తదితర బొగ్గుగని ప్రాంతాల్లో రెండు రోజులుగా 50.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండలోనూ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం అక్కడి చరిత్రలో తొలిసారి. ఇప్పటివరకు ఇక్కడ 1983 జూన్ 3, 1998 జూన్ 2 తేదీల్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కాగా, శనివారం రామగుండంలో 46.1 డిగ్రీలు, నిజామాబాద్‌లో 45.1, హైదరాబాద్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.
261 మంది మృతి..
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు శనివారం 261 మంది మృత్యువాతపడ్డారు. జిల్లాలవారీగా చూస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 74 మంది మృత్యువాతపడగా వరంగల్ జిల్లాలో 62 మంది, ఖమ్మం జిల్లాలో 39 మంది, కరీంనగర్ జిల్లాలో 38 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 17 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో 11 మంది, మెదక్ జిల్లాలో 11 మంది, నిజామాబాద్ జిల్లాలో నలుగురు, హైదరాబాద్‌లో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మృతి చెందా రు. కాగా, వడదెబ్బ మృతులకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే ఆర్. రవీంద్రకుమార్, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యలు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఈ ఏడాది ఎక్కువే...
2002 తర్వాత మళ్లీ ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. ఇప్పటివరకు చూస్తే 1973 మే 9వ తేదీన భద్రాచలంలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. మరో రెండు మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా ఉండే అవకాశం ఉందన్నారు.