50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే హృద్రోగ సమస్యలు ఇటీవల చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి అని సర్వే స్పష్టం చేసింది.
సాక్షి, హైదరాబాద్ : ‘ఆరోగ్యకరమైన జీవితం కోసం మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కానీ టార్గెట్లు పూర్తి చేయాలనే ఒత్తిడి, రోజులో ఎక్కువ సేపు రద్దీగా ఉన్న రోడ్లపై ప్రయాణించాల్సి రావడం, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల వాడకం కలిపి మనిషిని ఐదారు గంటలకు మించి నిద్రపోనివ్వడం లేదు. తల పక్కనే ఫోన్ పెట్టుకోవడం వల్ల తరచూ మేల్కొనే ఉంటున్నారు. మారిన జీవనశైలికి తోడు కంటికి కునుకు లేకపోవడం, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, ఏది పడితే అది తినడం.. ఇవన్నీ కలిపి పరోక్షంగా బీపీ, మధుమేహం, హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి’అని నీల్సన్–సఫోలాలైఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలిన అంశాలు. నిద్రలేమిపై ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో సర్వే నిర్వహించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ మూడు నగరాల్లో నిద్రలేమి సమస్యపై 1,226 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు.
భాగ్యనగరంలో 56 శాతం..
నిద్రలేమితో ఢిల్లీలో 76 శాతం మంది బాధపడుతుండగా, ముంబైలో 62 శాతం, హైదరాబాద్‌లో 56 శాతం మంది బాధపడుతున్నట్లు బయటపడింది. ఈ నిద్రలేమి తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుండగా, పరోక్షంగా ఇది గుండెపోటుకు కారణమవుతున్నట్లు పేర్కొంది. ఒత్తిడికి గురవుతున్న 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది, 41 నుంచి 50 ఏళ్లలోపు వారిలో 61 శాతం మందికి హృద్రోగ సమస్యల ముప్పు పొంచి ఉన్నట్లు సర్వేలో తేలింది.
ఇవీ కారణాలు..
నిద్రపోయే సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వీక్షించడం, చాటింగ్ చేయడం వల్ల మెదడు నుంచి సెరోటిన్ హార్మోన్ విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. దీని కారణంగా నిద్రలేమి ఏర్పడుతుంది. వేళకు నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి సమస్య తలెత్తుతుంది. ఈ ఒత్తిడి అధిక బరువుకు, రక్తపోటు, మధు మేహం వంటి రుగ్మతలకు కారణమవుతుంది. వీటి నియంత్రించకపోవడం వల్ల గుండెపై ప్రభావం చూపుతున్నాయి. యుక్త వయసులో వెలుగు చూస్తున్న గుండెపోటుకు ఇవే ప్రధానంగా కారణమవుతున్నట్లు నిర్ధారించింది.
ఐదుగురిలో ముగ్గురికి
ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో 2020 నాటికి ముగ్గురు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడే ప్రమాదం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే హృద్రోగ సమస్యలు ఇటీవల చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి అని సర్వే స్పష్టం చేసింది.
పురుషుల్లోనే అధికం..
అధిక బరువుతో బాధపడుతున్న బాధితుల్లో 57 శాతం మంది, ఒత్తిడిని ఎదుర్కొంటున్న బాధితుల్లో 56 శాతం మందికి హృద్రోగ ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో మానసిక ఒత్తిడితోపాటు హృద్రోగ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సుఖనిద్ర పొందిన వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలినట్ల ఆ సంస్థలు ప్రకటించాయి.
31% మరణాలకు ఇదే కారణం
జీవనశైలి మార్పు, పని ఒత్తిడి.. వెరసి అధిక బరువు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు కారణమవుతుంది. పరోక్షంగా ఇవి గుండె పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న 31 శాతం మరణాలకు గుండె పోటే కారణం. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం, కుటుంబ సభ్యులతో గడపడం, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం, రోజుకు కనీసం అర గంట వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ వాసు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్
జంక్ ఫుడ్‌తోనే అసలు ముప్పు
మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలకు బదులు చెడు కొవ్వు స్థాయిలు పెరుగుతున్నాయి. శరీరంలో పేరుకుపోతున్న ఈ కొవ్వును కరిగించే చర్యలు చేపట్టకపోవడం వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటుంది. ప్రతి రోజూ ఉదయం అరగంట వ్యాయామం చేయడం, వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డాక్టర్ సుజాతా స్టీఫెన్, పోషకాహార నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment