కరోనా ఉధృతి కొనసాగుతోంది. గ్రేటర్‌కు కోవిడ్ ముప్పు ఇంకా తప్పలేదు. ఇందుకు గత ఆరు రోజులుగా 64 పాజిటివ్ కేసులు నమోదవడమే నిదర్శనం. సడలింపులు..మద్యంఅమ్మకాలు..వలస జీవుల తరలింపు వంటి చర్యలతో నగరవ్యాప్తంగా బుధవారం జనం భారీగా రోడ్లపైకి వచ్చారు. ఒక దశలో లాక్‌డౌన్ తొలగించారా అన్న సందేహమూ కలిగింది. కానీ కరోనా కేసులు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం మలక్‌పేటగంజ్‌లో ఓ పాజిటివ్ కేసు నమోదు కాగా, నాగోల్ సాయినగర్ కాలనీలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఎస్‌ఆర్‌నగర్‌లో తొలికేసు నమోదైంది. మొత్తమ్మీద నగరవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో 591 కేసులు నమోదు కాగా...ఈ నెలలో కేవలం 6 రోజుల్లోనే 64 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ వైపు చాపకింది నీరులా వైరస్ విస్తరిస్తుండటం, మరో వైపు ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, సిటిజన్ల పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బుధవారం మలక్‌పేటగంజ్‌లో ఒకరికి పాజిటివ్ కేసు నమోదు కాగా, నాగోల్ సాయినగర్ కాలనీలో మరొకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం గాంధీ జనరల్ ఆస్పత్రిలో 419 మంది చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరిద్దరి మినహా మిగిలిన వారందరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే కింగ్‌కోఠి ఆస్పత్రిలో కొత్తగా మరో పది మంది అనుమానితులను అడ్మిట్ చేశారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న 15 మంది నుంచి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. నెగిటివ్ రిపోర్టులు వచ్చిన పది మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రెండు పాజిటివ్ కేసులు సహా మరో 13 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఇక ఎర్రగడ్డ ఛాతి ఆస్ప త్రికి కొత్తగా రెండు సస్పెక్టెడ్ కేసులు వచ్చాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు పాజిటివ్ బాధితులు సహా మరో ముగ్గురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన ఒకరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
మలక్‌పేటగంజ్‌లో మరొకరికి..
చాదర్‌ఘాట్: మలక్‌పేట గంజ్‌లోని టీటీసీ ఐటీసీ పేపర్ మార్ట్ లో పేపర్ కొనుగోలు చేయటానికి వచ్చిన వ్యక్తి (45)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడికి చికిత్స చేస్తున్న క్రమంలో కరోనా సోకినట్లు తేలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అతడు చార్మినార్ లాల్‌దర్వాజాకు చెందిన వ్యక్తిగా తెలిపారు.
సాయినగర్‌కాలనీలో డయాలసిస్ బాధితునికి
నాగోలు: ఎల్‌బీనగర్ సర్కిల్ 3 పరిధిలోని నాగోలు డివిజన్ సాయినగర్ కాలనీ రోడ్ నంబర్–4 లోపి స్మార్ట్ హాబిటాట్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే (27) వ్యక్తి గత కొంత కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం డయాలసిస్ నిమిత్తం మలక్‌పేట యశోధ హాస్పిటల్‌కు వెళ్లగా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో మంగళవారం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో అతను నివాసం ఉంటున్న అపా ర్ట్‌మెంట్‌లో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆరుగురికిని బుధవారం వైద్య ఆర్యోగశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి కరోనా లక్షణాలు కనిపించ లేదని అధికారులు తెలిపారు. వీరి కుటుంబ సభ్యులను 14 రోజలు హోం క్యారంటైన్ చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లో 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు అపార్ట్‌మెంట్ పరి సర ప్రాంతాలతో ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి కరోనా పాజిటివ్
చంపాపేట: ఎల్‌బినగర్ జోన్ లింగోజిగూడ డివిజన్ పరిధిలోని విజయపురి కాలనీకి చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి(61) మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాలనీకి చెందిన వ్యక్తి బీఎస్‌ఎన్‌ఎల్ లో లైన్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఏడాదిగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అతను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకునేవాడు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుండటంతో వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించగా కనోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జీహెచ్‌ఎంసీ సర్కిల్ సిబ్బంది అతడిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
వనస్థలిపురంలో మరో ముగ్గురికి..
వనస్థలిపురం: వనస్థలిపురం హుడా సాయినగర్‌లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్ బుధవారం తెలిపారు. హుడా సాయినగర్‌కు చెందిన వృద్ధురాలు, ఆమె కుమారుడికి ఇంతకు ముందే కరోనా పాజిటివ్ రాగా, బుధవారం నిర్వహించిన పరీక్షల్లో అతడి భార్య, కుమార్తె, కుమారులకు కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో సదరు వృద్ధురాలి ఇంట్లో ఐదుగురు, హిల్‌కాలనీలోని ఆమె కుమార్తె ఇంట్లో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లయ్యింది. వీరందరూ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కూరగాయల వ్యాపారి భార్యకు కరోనా పాజిటివ్
జియాగూడ: కరోనా వ్యాధితో ఇటీవల మృతిచెందిన కూరగాయల వ్యాపారి భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కుల్సుంపురా ఎస్‌ఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సబ్జిమండిలో నివసిస్తున్న ఓ కూరగాయల వ్యాపారికి ఈ నెల 2న కరోనా పాజిటివ్ రాగా చికిత్స పొందుతూ 5న మృతి చెందాడు. అతడి భార్య(33)కు వైద్య పరీక్షలు నిర్వహించగా బుధవారం పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. సబ్జిమండిని కంటైన్మెంట్ జోన్‌ను కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఎస్‌ఆర్‌నగర్‌లో తొలి కరోనా కేసు
అమీర్‌పేట: అమీర్‌పేట ఎస్‌ఆర్‌నగర్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. అమీర్‌పేట గ్రీన్‌పార్కు హోటల్ సమీపంలో జిమ్ నిర్వహిస్తూ ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తి గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు అతడిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా లక్షణాలు ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. సదరు బాధితుడి ఇంట్లో భార్య, కుమారుడు ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వీరు నివాసం ఉంటున్న భవనంలోనే హాస్టల్ కొనసాగుతున్నట్లు తెలిసింది. అతడి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు.ఎస్‌ఆర్‌నగర్‌లో తొలి పాజిటివ్ అకేసు నమోదు కావడంతో స్థానికులను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment