నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ : నగరంలో శుక్రవారం కురిసిన వర్షానికి ఓ ఇంటి గోడకూలి 9 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో చోటు చేసుకుంది. హఫీజ్‌బాబానగర్ బీబ్లాక్‌లో ఉండే మోహినుద్దీన్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని ఇంటికి శుక్రవారం దుబాయి నుంచి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పక్కనే నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల ఇంటి గోడ నానింది. మోహినుద్దీన్ ఇంటిపై ఆ గోడ కూలి పడటంతో ఇంట్లో ఉన్న మొత్తం 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. చుట్టుపక్కల వారు శిథిలాల నుంచి వారిని బయటకు తీసి, అపోలో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.