సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా ఈ నెల 27న రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఘనంగా నిర్వ హించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వేడుకను బీసీ సంక్షేమ శాఖ నిర్వహించాలని, ఇందుకు రూ.8 లక్షలు కేటాయించింది. వేడుకల నిర్వహణకు 84 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, 11 మందిని ఉపాధ్యక్షులుగా, 27 మందిని కన్వీనర్లుగా, 36 మందిని కో కన్వీనర్లుగా, 9 మందిని గౌరవ సలహాదారులుగా నియమించింది. జిల్లాస్థాయిలో వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి జిల్లాకు రూ.20 వేలు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.