
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితులు పత్తి రైతులకు సహకరించాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సూచించారు. త్వరలో పత్తి కొనుగోళ్లు జరపనున్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.
వచ్చే నెల నుంచి పత్తి మార్కెట్లోకి తరలిరానున్న నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులతో పార్థసారధి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాలను వారికి వివరించారు. గ్రామ, మండల రైతు సమన్వయ సమితులను పత్తి రైతులకు సహకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రైతు సమన్వయ సమితులు కీలకపాత్ర పోషించాలని, ఈ మేరకు సభ్యులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.