
సాక్షి, హైదరాబాద్ : కరనా వైరస్ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన 99 మంది అమెరికన్ జాతీయులను మంగళవారం వారి సొంత దేశానికి తరలించారు. ముందుగా ముంబై నుంచి వచ్చిన ఎ320 ఎయిర్‌బస్ విమానంలో శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారందరిని మధ్యాహ్నం 3.12 గంటల సమయంలో ముంబైకి తరలించారు. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15గంటల ప్రాంతంలో వారంతా అమెరికాకు బయలుదేరారు. కాగా యుఎస్ కాన్సులేట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చేసుకున్న అవగాహన ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న 99మందిని మధ్యాహ్నం 1 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. అనంతరం వారందరికి అప్పటికే పూర్తిగా సానిటైజ్ చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాన టెర్మినల్ బిల్డింగ్‌లో ఉంచారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారందరిని ఎ320 ఎయిర్‌బస్ విమానంలో తరలించారు. కాగా మార్చి 31న ఇదే విధంగా 38 మంది జర్మన్ దేశీయులను ఇండిగో ఫ్లైట్‌లో వారి స్వదేశానికి తరలించారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు.
(తెలంగాణలో 404కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు)