మృత్యువును జయించిన బాలిక
బోరుబావిలో పడ్డ చిన్నారి రెండున్నర గంటల తర్వాత బయటకు..
పరిగి/ కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండల పరిధిలో బోరుబావిలో పడిన ఓ చిన్నారిని రెండున్నర గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీ మండలంలోని ముదిరెడ్డిపల్లి తండాకు చెందిన లక్ష్మణ్, బుజ్జిబాయిలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నాయి. ఇందులో బతుకుదెరువు కోసం లక్ష్మణ్ దుబాయికి వెళ్లగా.. బుజ్జి పుణెలో పనిచేస్తోంది. ఇద్దరు కుమారులు ముదిరెడ్డిపల్లిలోనే ఉండి చదువుకుంటున్నారు. కుమార్తెలు నందిని అలియాస్ అంజలి(6), బుజ్జిలు చిన్నవారు కావడంతో అమ్మమ్మగారి ఊరైన గోవిందుపల్లితండాలో అమ్మమ్మ సీతాబాయి, తాతా భోజ్యానాయక్‌ల వద్ద ఉంటున్నారు. మంగళవారం సీతాబాయి, భోజ్యానాయక్‌లు తండా సమీపంలోని పొలానికి పనికి వెళ్లారు. నందిని కూడా వారితోపాటే వెళ్లింది.
అక్కడే ఉన్న బాలిక సాయంత్రం వేళ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిందని భావించారు. అయితే, ఇంటికీ రాకపోవడంతో వెతుక్కుంటూ మళ్లీ పొలానికి వెళ్లారు. అక్కడ బోరుబావిలోంచి శబ్దాలు రావడంతో గమనించగా, అందులో చిన్నారి పడిపోయినట్లు స్పష్టమైంది. ఆ బోరుబావి పూడ్చినా 10 ఫీట్ల మేరకు అలాగే వదిలేయడంతో చిన్నారి అక్కడ ఉన్నట్లు భావించారు. గ్రామసర్పంచ్ వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారమందించగా, వారు రావడంతో పాటు జేసీబీని రప్పించారు. 108 సిబ్బంది బోరుబావిలో చిన్నారికి ఆక్సిజన్ అందించారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బోరుబావికి సమాంతరంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చిన్నారిని క్షేమంగా బయటికి తీశారు. అనంతరం ఆమెను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.