
పల్లెల్లో శాంతికి ‘గ్రామ పోలీసు’
- ప్రయోగాత్మకంగా తాండూరులో అమలు
- హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్
తాండూరు: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు పల్లెల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ‘గ్రామ పోలీసు అధికారి(వీపీఓ)’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముందుగా తాండూరు మండలం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో వీపీఓ కార్యక్రమం అమలు చేస్తామని, అది విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. మూడు పంచాయతీలకు కలిపి ఓ గ్రామ పోలీసు అధికారిని నియమిస్తామన్నారు. వారంలో రెండుసార్లు వీపీఓలు తమకు కేటాయించిన గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లాలని, ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించి శాంతియుత వాతావరణం నెలకొనేలా కృషి చేయాలని సూచించారు.
12 రోజులకోసారి పల్లెనిద్ర
వీపీఓ ఆయా గ్రామాల్లో 12 రోజులకోసారి పల్లె నిద్ర చేస్తారని డీఐజీ తెలిపారు. నేరరహిత గ్రామాలకు ప్రత్యేక చొరవతో పాటు ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూస్తామని చెప్పారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని 22 పంచాయతీలను ఇప్పటికే క్రైం ఫ్రీగా ప్రకటించినట్టు ఆయన గుర్తుచేశారు. ఇప్పటి వరకు పాత కేసులను తగ్గించడంతోపాటు 2017 జనవరి నాటికి నేరాలను నియంత్రించి కొత్తగా కేసులు నమోదు కాని గ్రామాలను క్రైం ఫ్రీ గ్రామాలుగా ప్రకటిస్తామని డీఐజీ తెలిపారు.