
డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి..
నిర్లక్ష్యంగా గర్భసంచి ఆపరేషన్.. పేగుతో కలిపి కుట్లు
జమ్మికుంట(హుజూరాబాద్): కడుపు నొప్పి ఉందని ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ వైద్యుడి నిర్లక్ష్యంతో చివరికి ప్రాణం కోల్పోయింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన జరగగా, మహిళ మృతిపై కోపోద్రిక్తులైన బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. జయశంకర్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమిటిపల్లి గ్రామానికి చెందిన మెరుగు సుజాత(35) కడుపునొప్పితో బాధపడుతూ గత నెలలో జమ్మికుంటలోని జమ్మికుంట మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్ రాఘవేంద్ర వద్ద వైద్య పరీక్షలు చేసుకున్నారు.
స్కానింగ్ చేసిన ఆయన గర్భసంచికి కంతులు, వాపు వచ్చిందని, ఆపరేషన్ చేయాలని సూచించాడు. ఈ నెల 1న ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్ రాఘవేంద్ర నిర్లక్ష్యంగా పేగుతో కలిపి కుట్లు వేశాడు. నాలుగు రోజుల తర్వాత ఇంటికి పంపించాడు. తర్వాత సుజాతకు కడుపు నొప్పి తగ్గకపోగా.. కడుపు ఉబ్బుతూ వాంతులు మొదలయ్యాయి. రెండు రోజుల తర్వాత సుజాత మళ్లీ ఆస్పత్రికి వచ్చి సమస్య చెప్పింది. వైద్యుడు మందులు రాసి పంపించాడు. అయినా తగ్గకపోవడంతో గురువారం మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
హన్మకొండలో స్కానింగ్ తీసుకోవాలని వైద్యుడు పంపించాడు. కడుపులో పేగు మడత పడిందని అక్కడి వైద్యులు సూచించారు. స్కానింగ్ రిపోర్టును తీసుకొచ్చి చూపించగా, గురువారం రాత్రి 10 గంటలకు సుజాతకు డాక్టర్ ఆపరేషన్ చేశాడు. సుజాత భర్త తిరుపతిని రక్తం కోసం రాత్రి వేళ హన్మకొండకు పంపించాడు. రాత్రి ఒంటిగంట సమయంలో సుజాతను హన్మకొండకు తీసుకొస్తున్నామని, మీరు అక్కడే ఉండాలని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పడంతో తిరుపతి హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రి వద్దే ఉన్నాడు.
2 గంటల సమయంలో హన్మకొండకు చేరుకోగా.. మాక్స్‌కేర్ వైద్యులు సుజాతను చూసి చనిపోయిందని నిర్ధారించారు. దీంతో మృతురాలి బంధువులు, కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆందోళన చేశారు. అయినా, వైద్యులు రాకపోవడంతో ఆస్పత్రి అద్దాలు, కంప్యూటర్ సామగ్రిని ధ్వంసం చేశారు. సీఐ ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో ఆస్పత్రి వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. చివరకు ఇరువర్గాల పెద్ద మనుషులు చర్చలు జరిపి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.