జనాభానూ మించిన ‘ఆధార్’ | 'Aadhaar' cards more than population | Sakshi
Sakshi News home page

జనాభానూ మించిన ‘ఆధార్’

Published Tue, Jul 29 2014 12:34 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

'Aadhaar' cards more than population

సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డులే కాదు.. ఆధార్ కార్డులు సైతం జనాభాను మించిపోయాయి. ఇప్పటికే సుమారు 15 శాతం కార్డులు అధికంగా జారీ అయ్యాయి. కార్డులు ఇంకా తీసుకోని వారు మరో 20 శాతం వరకు ఉంటారు. ఇది ఎలా సాధ్యమో జారీ చేసిన వారికే తెలియాలి. జనాభా కంటే రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైపు మొత్తుకుంటున్నారు. బోగస్ రేషన్ కార్డులు అధికంగా ఉన్నాయని, వాటిని రద్దు చేయాలని ఆయన భావిస్తున్నారు.

 అదే సమయంలో ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆధార్ కార్డుల సంఖ్య కూడా జనాభా కంటే అధికంగా ఉండడంతో అధికారులు సైతం అవాక్కవుతున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల జనాభా 93.06 లక్షలు ఉండగా బహుళ ప్రయోజనకారి ఆధార్  (వ్యక్తుల విశిష్ట సంఖ్య) కార్డులు జారీ అయిన వారి సంఖ్య అక్షరాల కోటి ఏడు లక్షలు. జనాభా కంటే 15.49 శాతం అధికంగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయి.

ఆధార్ నంబర్ల జారీలో జంట జిల్లాలు ఉమ్మడి రాష్ర్టంలో మొదటి వరుసలో నిలిచాయి. ఇదిలావుంటే ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకొని ఐరిస్ దిగిన సుమారు 10 శాతం మందికి ఇప్పటికీ నంబర్లు జారీ కాలేదని తెలుస్తోంది. అదీగాక మరో పదిశాతం మంది ఇప్పటివరకు ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోలేదని సమాచారం. వీరంతా కలిస్తే మరో 20 శాతం కార్డులు పెరిగే అవకాశం ఉంది.

 ఆధార్ లేనివారిలో ఆందోళన..
 ఆధార్ నంబర్ ఆధారంగానే సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని తాజాగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే వివిధ శాఖల డేటాబేస్‌ను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఆధార్ నంబర్లు జారీ కాని వారు ఈ పరిణామంతో ఆందోళన చెందుతున్నారు. బహుళ ప్రయోజనం చేకూర్చే ఆధార్ కార్డు తప్పనిసరి అని, ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులు కలిగి ఉండాలని పౌరసరఫరాలశాఖ మొదట్లో ప్రత్యేక శ్రద్ధను కనబరిచింది.

 ఆ తరువాత పట్టించుకోకపోవడంతో నంబర్ల జారీ, కార్డుల పంపిణీ నత్తనడకనసాగింది. ఆధార్ కోసం పేర్లను నమోదు చేసుకున్న వారిలో కొందరికి మాత్రమే కార్డులు అందగా, మరి కొందరు ఇంటర్‌నెట్ ద్వారా ఈ-ఆధార్ కార్డులను పొందారు. నంబర్లు జారీ కాని వారు ఎవరిని సంప్రదించాల్లో అర్థంకాని పరిస్థితి నెలకొంది.   

 నాలుగేళ్లుగా...
 ఆధార్ నమోదు ప్రక్రియ నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2010 సెప్టెంబర్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆధార్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్లో 136 కేంద్రాలు ఏర్పాటు చేసి నమోదు ప్రక్రియను చేపట్టారు. 2012 ఫిబ్రవరి 15న పౌరుల వివరాలు విదేశాలకు చేరితే దేశరక్షణకే ప్రమాదమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలుపడంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సాఫ్ట్‌వేర్ హాలిడే ప్రకటించింది.

దీంతో ఆధార్ వివరాల సేకరణ ప్రక్రియకు అప్పట్లో తాత్కాలికంగా బ్రేక్ పడింది. తిరిగి అదే ఏడాది సెప్టెంబర్ నుంచి ఆధార్ కేంద్రాలను పునః ప్రారంభించారు. శాశ్వత ప్రాతిపదికన ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, సామాజిక భద్రత పింఛన్లను కూడా ఆధార్‌తో అనుసంధానం చేయడంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ కోసం  నగదు బదిలీ పథకం అమలు దృష్ట్యా వంటగ్యాస్ వినియోగదారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినమోదు ప్రక్రియ వెగవంత చేసి ఆధార్ నంబర్లు జారీ చేశారు.

 ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆధార్ నమోదు..
 ప్రస్తుతం ఆధార్ నమోదు ప్రక్రియ మీ సేవ కేంద్రాల్లో కొనసాగుతోంది. పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు  కేంద్రాలు మూతపడ్డాయి. ఆధార్ నమోదు చేసుకోని వారు మీ సేవ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకొని ఐరిస్ ఫొటోలు దిగవచ్చని హైదరాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement