
నోట్లో గుడ్డలు కుక్కి..గొంతు కోసి చంపేశారు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా జవహార్ నగర్లో రాకేష్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారం గ్రామానికి చెందిన బాల్‌రెడ్డి కుమారుడు రాకేష్‌రెడ్డిని బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దుండగులు రూ. 8లక్షలు డిమాండ్ చేసినట్టు రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
జవహార్ నగర్లోని సాకేత్ టవర్స్ పక్కనున్న అపార్ట్ మెంట్లో రాకేష్ రెడ్డి మృత దేహం ఉందని బంధువులు ఇచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అతడి నోటికి గుడ్డ కట్టి తీవ్రంగా కొట్టి, గొంతుకోసి హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రి తరలించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేష్ రెడ్డి సోదరి విడాకులు వ్యవహారంలో ఆమె భర్తతో తలెత్తిన గొడవలు..రాకేష్ రెడ్డి మృతికి కారణమై ఉంటాయా అన్న కోణం లో కూడా పోలీసులు విచారిస్తున్నారు.