
టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకోంటోంది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు అందిన గంట వ్యవధిలోనే మరో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. మంగళవారం రాత్రి వేం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఇంట్లో ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే వేం నరేందర్ రెడ్డిని నేరుగా ఏసీబీ అదుపులోకి తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
కాగా, అంతకముందు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరికొంత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.