విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వేం నరేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక నేతల చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారుల్నీ ఈడీ అధికారులు మంగళవారం ఏడున్నర గంటల పాటు విచారించారు. ఈ నెల 18న ఉదయ్‌సింహ, 19న రేవంత్‌రెడ్డిలను విచారించనున్నారు.
రూ.50 లక్షల కేంద్రంగానే విచారణ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి 2015లో చంద్రబాబు కుట్ర పన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇస్తామని బేరసారాలు జరిపించారు. తర్వాత అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే, ఇప్పటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి స్టీఫెన్‌సన్ వద్దకు వెళ్లి రూ.50 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన భారీమొత్తం పూర్వాపరాలు తేల్చాలంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అప్పుడే ఈడీకి లేఖ రాసింది. దీంతో ఆ రూ.50 లక్షలతోపాటు మిగిలిన రూ.4.5 కోట్లు ఎక్కడివనే విషయాన్ని తెలుసుకునే దిశగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దీనికి సంబంధించే నాటి ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమారులకు ఈ నెల 1న నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి వచ్చారు. రాత్రి ఏడు గంటల వరకు ముగ్గురినీ వేర్వేరుగా ప్రశ్నించిన అధికారుల బృందం.. పలు కీలక అంశాలను తెలుసుకుంది. వీరి నుంచి కొన్ని డాక్యుమెంట్లను సైతం తీసుకుంది.
ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డితోపాటు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరినీ విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఉదయ్‌సింహ, రేవంత్‌రెడ్డిలకు నోటీసులు ఇవ్వగా.. మిగిలిన వారికి త్వరలో ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపించారు. అది చంద్రబాబు వాయిస్ అని ఇప్పటికే నిర్ధారించారు. మరోవైపు ఏసీబీ అధికారులు దాఖలు చేసిన అభియోగపత్రాల్లో 22 చోట్ల చంద్రబాబు పేరు చేర్చారు.
నా కుమారుల్ని పిలవడం బాధాకరం...
ఈడీ విచారణ ముగిసిన తర్వాత వేం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు కోట్లు కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమారుల్ని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్ మెంట్ (ఈడీ) విచారణకు పిలవడం బాధాకర మని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. వారు కోరిన డాక్యుమెంట్లు సైతం అందించాను. మరోసారి పిలిచినా హాజరవుతాను. రేవంత్‌రెడ్డి సైతం త్వరలో విచారణకు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును కేంద్రానికి అప్పగించినట్లు అనిపిస్తోంది’అని నరేందర్ పేర్కొన్నారు.
నరేందర్‌రెడ్డికి ‘ముఖ్య’మైన కాల్స్..?
ఈడీ విచారణ ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే వేం నరేందర్‌రెడ్డికి కొన్ని ‘ముఖ్య’మైన ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు ప్రధానంగా ఏ విషయంపై గురిపెట్టారు? ఎలాంటి ప్రశ్నలు సంధించారు? తదితర వివరాలను ఆరా తీసినట్లు సమాచారం. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కొందరు ప్రముఖుల ప్రమేయం సైతం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇదే విషయాన్ని గమనించిన ‘ముఖ్య’నేతలు, ‘చిన’నేతలకు సంబంధించిన వ్యక్తులు ఈడీ విచారణ, దర్యాప్తు తీరులతో పాటు ప్రశ్నావళినీ వేం నరేందర్‌రెడ్డి నుంచి సేకరిస్తున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment