'రాత్రి రాలేను.. ఉదయం నేరుగా విచారణకు హాజరవుతా'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి గంటన్నర వ్యవధిలోనే ఇద్దరు టీడీపీ నేతలకు నోటీసులను అందజేశారు. ఇందులో భాగంగా తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే వేం నరేందర్ రెడ్డి తనకు ఆరోగ్యం బాగోలేదనీ, తాను గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పారు. దాంతో తాను ఈ రాత్రి విచారణకు రాలేనని ఏసీబీకి ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
విచారణలో భాగంగా బుధవారం ఉదయం తానే నేరుగా హాజరవతాననీ, ఏం సమాచారం కావాలని అనుకుంటున్నారో, ఆ ప్రకారంగా తాను ఏసీబీకి సహాకరిస్తానని చెప్పినట్టు తెలిసింది. ఏసీబీ అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి తాను సిద్ధమని చెప్పినట్టు తెలిసింది. దాంతో ఈ ఉదయం విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు చెప్పి వెళ్లినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, విచారణకు మాత్రమే హాజరవమన్నారని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఏసీబీ అధికారులు వెళ్లిన అనంతరం వేం నరేందర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు కాపలా ఏర్పాటు చేసినట్టు సమాచారం.
అంతకముందు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హజరుకావాలని నోటీసులు జారీ చేశారు. సీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే క్వార్టర్స్ నంబర్ 208 (ఇంటికి)కి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సండ్ర వెంకటట వీరయ్యపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది.