
టీడీపీ నేతలకు నోటీసులు సిద్ధం!
* ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని విచారించనున్న ఏసీబీ
* తర్వాత సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావులకు పిలుపు
* మత్తయ్య, సెబాస్టియన్‌తో మాట్లాడిన ఎమ్మెల్యేలపైనా దృష్టి
* గన్‌మెన్‌ను దూరంగా పెట్టి వ్యవహారం నడిపిన రేవంత్
* ఓటుకు నోటు కేసులో మరికొందరికి ఉచ్చు బిగించే పనిలో ఏసీబీ
సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీ ‘ముఖ్య’ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి తెర వెనక నుంచి వ్యవహారాన్ని నడిపిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సిద్ధమైంది. దొంగ చాటుగా ఈ బాగోతాన్ని నడిపిన నేతలను త్వరలోనే ప్రశ్నించనుంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపిన టీడీపీ నేతలందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేసి నిర్దేశిత సమయానికి విచారణకు హాజరు కావాలని కోరనుంది. శాసనమండలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డిని రెండుమూడు రోజుల్లోనే విచారించనుంది. ఆ తర్వాత సీనియర్ నేతలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావుతో పాటు ఈ కేసుతో సంబంధమున్న ఇతరులకూ నోటీసులు జారీ చేయనుంది. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ కుట్ర జరిగినట్లు ఆడియో, వీడియో టేపుల ద్వారా ఇప్పటికే వెల్లడైంది. ఈ కుట్రను అమలు చేసేందుకు ‘ఐదు ముఠాల’ను ఏపీ సీఎం రంగంలోకి దింపినట్లు ఏసీబీ గుర్తించింది. స్టీఫెన్‌సన్‌తోపాటు ఇతర తెలంగాణ ఎమ్మెల్యేలతో టీడీపీ జరిపిన సంప్రదింపులకు సంబంధించిన కాల్ డేటా, వీడియో, ఆడియో టేపులతో ఈ ముఠాల ఉనికి వెలుగులోకి వచ్చింది. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ముట్టజెప్పి అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఠా ఇప్పటికే కటకటాల పాలైంది.
మిగిలిన నాలుగు ముఠాల పని పట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. దశలవారీగా నోటీసులు పంపించి ఈ ముఠాల్లోని వ్యక్తులను వేర్వేరుగా విచారించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తొలి విడతగా ఒకటి రెండు రోజుల్లో గరికపాటి, సీఎం రమేశ్‌కు నోటీసులిచ్చే అవకాశముంది. ఇక ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన మత్తయ్య, సెబాస్టియన్‌కు పలువురు టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వారికీ నోటీసులు పంపనుంది. కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డి గన్‌మన్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసింది. అరెస్టుకు మూడు రోజుల ముందు నుంచే రేవంత్ తమను దూరంగా ఉంచారని గన్‌మన్ తెలిపారు. గన్‌మన్ లేకుండానే రేవంత్ పలుమార్లు హైదరాబాద్‌లో సంచరించినట్లు ఏసీబీ కూడా గుర్తించింది.