ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)పై యాక్సిడెంట్‌లు నిత్యకృత్యమయ్యాయి. వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలకు కారణం అతివేగమే అంటూ చేతులు దులుపుకొంటున్న హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్ విభాగ అధికారులు... దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ప్రమాదాలు జరిగే 29ప్రాంతాలను గుర్తించినప్పటికీ కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్‌వర్స్ బార్ మార్కింగ్‌లు ఏర్పాటు చేయడం లేదు. ఓఆర్‌ఆర్ భద్రతపై రెండేళ్ల క్రితం సీఆర్‌ఆర్‌ఐ చేసిన ప్రతిపాదనలనూ గాలికొదిలేశారు.
సాక్షి, సిటీబ్యూరో: అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో రోడ్డు ప్రమాదాలు జరిగితే చాలు...అతివేగమే కారణమంటూ చేతులు దులుపుకునే అధికారులు ఆ వేగానికి కళ్లెం వేసే చర్యలను మాత్రం ఆచరణ రూపంలోకి తీసుకరావడం లేదు. ‘ఎక్స్‌ప్రెస్‌వేపై డైరెక్షనల్ మార్కింగ్ స్పష్టంగా కనపడాలి...ఇంటర్‌ఛేంజ్‌లు, ర్యాంప్‌లు...మీడియం లేన్...సోల్డర్ లైన్...ఇలా అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాహనాల వేగానికి కళ్లెం వేయవచ్చ’ని న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆర్‌ఆర్‌ఐ) రెండేళ్ల క్రితం సమర్పించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఓఆర్‌ఆర్ విభాగ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యధికంగా ప్రమాదాలు జరిగే 29 ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని అధ్యయనం చేయడం ద్వారా మెయిన్‌టెనెన్స్ లోపాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చేసిన సూచనలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఓఆర్‌ఆర్ మార్గంలో లక్షా 40వేల వాహనాలు ప్రయాణిస్తున్నా భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై విమర్శలు వస్తున్నాయి.
వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లపై శ్రద్ధ ఏదీ..?
పెద్ద కారులు, చిన్న కారులు, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ ట్రక్కులు సీఆర్‌ఆర్‌ఐ అధ్యయనం చేసిన 29 ప్రాంతాల్లో పరిమితికి మించిన వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నాయని గుర్తించింది. పెద్ద కారులు గంటలకు 108 నుంచి 127 కిలోమీటర్ల వేగం, చిన్నకార్లు 102 నుంచి 124 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్టుగా రిపోర్టులో పేర్కోన్నారు. 50 శాతం పెద్ద కార్లు, 30 శాతం చిన్న కార్లు, ఏడు శాతం లైట్ కమర్షియల్ వెహికల్స్, ఒక శాతం భారీ ట్రక్కులు వేగంతో వెళుతున్నట్టుగా గుర్తించారు. ఈ పరిస్థితి వల్లనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాడు. ఈ ప్రాంతాల్లో కర్వ్‌లు, గ్రాండెంట్ సెక్షన్లు, ట్రాన్స్‌వర్స్ బార్ మార్కింగ్, మీడియన్ డెలినియోటర్స్‌తో కలిపి మీడియన్ మార్క్‌లు, స్పీడ్ అరెస్టర్స్ ఏర్పాటుచేయడం వల్ల వేగాన్ని నియంత్రించవచ్చని సీఆర్‌ఆర్‌ఐ ప్రతిపాదనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదు.
‘టిపికల్’ ప్రమాదాలపై నిర్లక్ష్యం...
ఓఆర్‌ఆర్‌పై చాలా వాహనాలు మితిమీరిన వేగంతో అదుపుతప్పి స్తంభాలను ఢీకొట్టి అవతల ఉన్న సర్వీస్ రోడ్డుపై ఎగిరిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఓఆర్‌ఆర్ అంతటా మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్ సరైన ఎత్తులో ఉండేలా చూసుకోవాలని, ఇవన్నీ ఒకేతీరున ఎత్తు తక్కువగా ఉండటం వల్ల వాహనాలు వాటిని గుద్ది అవతల ఎగిరిపడుతున్నాయని గుర్తించిన సీఆర్‌ఆర్‌ఐ ‘టిపికల్ డబుల్ మెటల్ బీమ్ క్రాష్ బ్యారియర్స్’ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని స్పష్టం చేసినా ఆ పనుల్లో పురోగతి మాత్రం ఏమీ కనపడటం లేదు. అలాగే ఎక్స్‌ప్రెస్‌హైవేలో డైరెక్షనల్ మార్కింగ్‌లు వాహనదారులకు స్పష్టంగా కనబడేలా చర్యలను ఆశించిన రీతిలో తీసుకోలేదు.
‘రాత్రి సమయాల్లో వాహనదారుల భద్రత కోసం ఎడ్జ్ స్టడ్స్, లేన్ డివైడర్ స్టడ్స్ అవసరముంది. ఎక్స్‌ప్రెస్ వే కుడివైపు లేన్, మీడియన్ సైడ్‌ను తెలుపు రంగుతో మార్కింగ్ చేయాలి. అదేవిధంగా కుడివైపున రోడ్డు స్టడ్స్‌ను ఎరుపు రంగులో, మీడియన్ సైడ్ లేన్ పసుపు రంగులో మార్క్ చేయాలి. ఎక్స్‌ప్రెస్ వే హైస్పీడ్ వయోలేషన్స్ కుడివైపు, మీడియం లేన్లు రెడ్ కలర్ స్టడ్స్‌ను ఉపయోగించాలి. ఎక్స్‌ప్రెస్‌వేకి అనుసంధానం చేసే ర్యాంప్‌ల్లో చెవ్రాన మార్కింగ్ చేయడంతో పాటు బొల్లార్డ్స్‌ను ఉపయోగించాలి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ‘నో స్టాపింగ్, నో పార్కింగ్, నో ఓవర్‌టేకింగ్ సైన్స్’ ఏర్పాటుచేయాలి. ఎగ్టిట్, ఎంట్రీ ప్రాంతాలవద్ద ఎనిమిది నుంచి పది మిల్లీమీటర్లు థింక్ పెయింట్‌ను రోడ్డు స్టడ్స్‌కు వేయాలి. వేగాన్ని నియంత్రించేందు బొల్లార్డ్స్ కూడా ఏర్పాటుచేయాల’ని సీఆర్‌ఆర్‌ఐ చెప్పినా అధికారులు మాత్రం తమకు ఏమీ అంటనట్టుగా వ్యవహరిస్తుండటంతో వాహనదారుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment