
బెంగళూరులో వరకట్నపు చావు
భార్యను హత్య చేసి
ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త
టీఎస్‌ఎస్పీ నాలుగో
బెటాలియన్‌లో విషాదం
స్వప్నది ఆత్మహత్య కాదు..
హత్యే అంటున్న తల్లిదండ్రులు
మామునూరు : అదనపు కట్నం కోసం కట్టుకున్నోడే భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. బెంగళూరులో గత శనివారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడడంతో వరంగల్‌లోని మామునూరు బెటాలియన్‌లో మంగళవారం విషాదం నెలకొంది. మామునూరు టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న సలేంద్ర సుధాకర్ కూతురు స్వప్న(23)ను నల్లబెల్లి మండలం పంతులుపల్లికి చెందిన ఆసం సుదర్శన్ కొడుకు రాంప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం సందర్భంగా రూ.8లక్షల కట్నం, బంగారు ఆభరణాలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. రాంప్రసాద్ బెంగళూర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వారి కాపురం కొద్ది రోజులుగా సజావుగానే సాగింది. ఈ క్రమంలో అత్తమామలు ఒత్తిడి తేవడంతో అదనపు కట్నం తేవాలని స్వప్నను రాంప్రసాద్ చిత్రహింసలు పెడుతున్నాడు.
విషయూన్ని ఆమె తన తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో వారు రాంప్రసాద్ తల్లిదండ్రుల వద్దకు వెృళ్లి మీ కుమారుడిని మందలించాలని కోరారు. ఆయినా రాంప్రసాద్ తీరు మారలేదు. ఈ క్రమంలోనే అతడు పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలోనే మరో అమ్మాయితో రాంప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో కొద్ది రోజులుగా భార్య స్వప్నను ఎలాగైన వదిలించుకోవాలని మరో అమ్మాయితో కలిసి రాంప్రసాద్ పథకం పన్ని విఫలమయ్యూడు. చేసేది లేక రాంప్రసాద్ శనివారం మధ్యాహ్నం భార్యను కొట్టి చంపి అదే రాత్రి ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఆత్మహత్యగా చిత్రీకరించాడు.
అంతేకాక స్వప్న తల్లిదండ్రులకు ఆదివారం మధ్యాహ్నం మీ కుమార్తె ఉరి వేసుకుని మృతిచెందిందని రాంప్రసాద్ స్వయంగా ఫోన్ ద్వారా తెలిపాడు. దీంతో బెంగళూర్‌కు చేరుకొని మృతిరాలి తండ్రి సలేంద్ర సుధాకర్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారని మృతురాలి తండ్రి చెప్పారు. తమ కూతురుది ఆత్మహత్య కాదు.. హత్యే అని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బెంగళూర్‌లోని ప్రభుత్వ వైద్యశాలలో ఫోస్ట్‌మార్టం పూర్తి చేసిన స్పప్న మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం మామునూరు క్వార్టర్స్‌కు తరలించారు. కాగా, మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.