మార్ఫింగ్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్..
సాక్షి, హైదరాబాద్ : విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, తిట్లు.. ఎన్నికలంటే ఇవి ఎప్పుడూ ఉండేవే. కానీ ఈసారి ఎన్నికల్లో వీటితోపాటు సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు.. నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో స్ఫూప్ వీడియోలతో, మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. రాజకీయ జోకులు, సెటైర్లకు కొదవే లేదు. ఈ క్రమంలో కళాకారులు, గాయకుల పాటలనూ, వీడియోలనూ వినియోగించుకుంటున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి.. దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా తన అనుమతి లేకుండానే తన పాటకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ వైరల్ చేస్తుండటంతో ఓ కళాకారుడు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తప్పుడు ఉద్దేశాలతో సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా తన పాటను వైరల్ చేస్తుండటంపై ఆయన తీవ్రంగా కలత చెందుతున్నారు.
ఆదేశ్ రవి.. కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత, కళాకారుడు, గాయకుడు. చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా తెరకెక్కుతున్న ‘తుపాకీ రాముడు’ సినిమాకు సహా రచయితగా డైలాగ్‌లు అందించారు. ఆ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రవి గత ఏడాది‘థూ.. మీ బతుకు చెడా’ అని ఓ సెల్ఫీ వీడియో పాటను రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేశారు. సమాజంలో క్షీణిస్తున్న నైతిక విలువల్ని ఎత్తిచూపుతూ.. స్వార్థపూరితంగా వ్యవహరించే మనుషుల ధోరణిని వ్యంగ్యంగా నిలదీస్తూ.. ఆవేదనతో ఈ వీడియో పాటను ఆయన రూపొందించారు. ‘దేవుడికి మొక్కుతవ్.. ప్రజల సొమ్ము నొక్కుతవ్’... ‘కమీషన్లు కొట్టి.. కట్టలుకట్టలు పేర్చి.. సచ్చినప్పుడు పట్టుకుపోతవ్‌రా.. థూ నీ బతుకు చెడా.. థూ నీ బతుకు చెడా..’ అంటూ ఆయన పోస్టుచేసిన పాటను అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
ఒరిజనల్ వీడియో సాంగ్ స్క్రీన్ షాట్.. ఇన్‌సెట్లో (ఆదేశ్ రవి)
కానీ, ఎన్నికల నేపథ్యంలో ఆదేశ్ రవి పాటను మార్ఫింగ్ చేసి ‘పీకినవ్ తియ్’ అనే ఫేస్‌బుక్ పేజీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హుస్నాబాద్ ఎన్నికల సభలో ‘థూ.. మీ బతుకులు చెడా’ అని కేసీఆర్ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదేశ్ రవి వీడియో పాటను సీఎం కేసీఆర్‌కు ఆపాదిస్తూ.. ఆయనను కించపరిచేలా.. దూషించేలా వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలియడంతో కలత చెందిన ఆదేశ్ రవి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఫేస్‌బుక్ పేజీ ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే, వాట్సాప్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ‘నా పాటను మార్ఫింగ్ చేసి.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి నేను పాడినట్టు కల్పించడం షాక్ గురిచేసింది. రాజకీయ ప్రచారాల కోసం ఇలా కళాకారుల సృజనను దుర్వినియోగపరచడం ఎంతమాత్రం సబబు కాదు’ అని ఆదేశ్ రవి అన్నారు. రాజకీయాలు, ఎన్నికలు ఎలా ఉన్నా వ్యక్తులపై బురద జల్లేవిధంగా, విద్వేషాలు పెంచేవిధంగా వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు.. ఏదీఏమైనప్పటికీ ఈ ఒక్క వీడియో అనే కాదు.. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను కించపరిచేలా అనేకమైన మార్ఫింగ్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment