‘చీప్’గా చేస్తున్నారు..! | adulterated alcohol sales in Bhuvanangiri division | Sakshi
Sakshi News home page

‘చీప్’గా చేస్తున్నారు..!

Published Sat, Sep 6 2014 3:33 AM | Last Updated on Fri, Aug 17 2018 7:51 PM

‘చీప్’గా చేస్తున్నారు..! - Sakshi

‘చీప్’గా చేస్తున్నారు..!

మూతతీయ్.. కల్తీచెయ్
- మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం
- భువనగిరి డివిజన్‌లో కల్తీ మద్యం అమ్మకాలు
- అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు
భువనగిరి : లాభార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు అడ్డదారులు వెతుకుతున్నారు. యథేచ్ఛగా మద్యా న్ని కల్తీ చేస్తూ మద్యం ప్రియులప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల మద్యం ఫుల్‌బాటిళ్ల మూతలు తీసి అందులో స్పిరిట్, నీళ్లు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు పట్టణంలో ఈ రకంగా కల్తీ చేసిన మద్యం సీసాలను స్థానికులు ఎక్సైజ్ అధికారులకు పట్టించా రు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. అయితే ఇదంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీకే మద్యా న్ని విక్రయించాలనే నిబంధనను మద్యం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం : ఏడుకొండలు ఎక్సైజ్ సీఐ ఆలేరు
 ఆలేరులోని  ఓ దుకాణంలో మద్యం కల్తీ జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాం. ఆ షాపు నుంచి మద్యం షాంపిళ్లను సేకరించాం. వాటిలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై నిగ్గు తేల్చాలని కోరాం. నివేదిక రాగానే తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం.
 
కల్తీ ఇలా..
మద్యం వ్యాపారులు పలు చోట్ల సిండికేట్‌గా మారి ప్రతి మండలంలో ఒక హోల్‌సేల్ దుకాణాన్ని అనధికారికంగా నడుపుతున్నారు. ఆ దుకాణం నుంచి ఆయా మండలాల్లోని బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దీంతో ఎక్కువగా అమ్మకాలు ఉండే దుకాణాన్ని ఎంపిక చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం కల్తీ చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన అనుభవం కలిగిన వ్యక్తులను నియమించినట్లు తెలిసింది. రాత్రి మద్యం దుకాణం మూసే సమయం, లేదంటే ఉదయాన్నే దుకాణంలోకి వచ్చి తాము ఎంచుకున్న బాటిళ్ల మూతలను సీల్ చిరిగిపోకుండా పైకి తీస్తారు.

వెంటనే అందులోంచి క్వార్టర్ సీసా మద్యం తీసి కొన్ని నీళ్లు, మరికొంత స్పిరిట్ కలిపి దాని మూతను యథావిథిగా బిగిస్తారు. ఇదంత ఒక గంటలోపు పూర్తి చేస్తారు. అనంతరం ఆయా మద్యం సీసాల నుంచి తీసిన మద్యాన్ని ఒక సీసాలో పోస్తారు. నాలుగు బాటిళ్లకు ఒక బాటిల్ చొప్పున అదనపు మద్యం తయారు చేయడం జరుగుతుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఎక్కువగా అమ్మకాలు ఉన్న బ్రాండ్ మద్యం సీసాల్లో ఈ రకమైన కల్తీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి.
 
అడ్డుకోవాల్సిన అధికారుల వత్తాసు
మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం చేస్తున్నారు. ఇటీవల ఆలేరులో ఇలా పట్టుకున్నసమయంలో ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇది పెద్ద సమస్య కాదని కామన్ అంటూ ఓ అధికారి అన్నట్లు ఫిర్యాదు దారులు ‘సాక్షి’కి చెప్పారు.

కాగా ఇప్పటికే ముగిసిన బోనాల పండగ, దసరా,బతుకమ్మ పండగల నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బొమ్మలరామారం, భువ నగిరి,బీబీనగర్ ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలను అధికారులు నిరోదించారు. మళ్లీ పండగల నేపథ్యంలో డివిజన్‌కు పొరుగన గల హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి నకిలి మద్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కఠిన  చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement