కేన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు నడుం కట్టారాయన. తన దేశంలో కేన్సర్ కారణంగా సగటు మనిషి జీవితం కాలం చాలా తక్కువగాఉండటంతో తనను ఎంతో కలతకు గురిచేసింది. రోగుల సంఖ్య భారీగా పెరగడంతో కేన్సర్‌పై యుద్ధంప్రకటించేందుకు తానే ఓ ఆస్పత్రిని స్థాపించాలని భావించారు.వ్యాధిపై అధ్యయనం కోసంభారత్‌లోని హైదరాబాద్ నగరంఅనువైన ప్రాంతమని తలచి ఇక్కడికి వచ్చారు. ఆయనే అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌కు చెందినఅబు బకర్ ఘర్జాయ్. కుటుంబమంతా దేశ రక్షణ, రాజకీయ రంగాల్లోఉండగా.. అబుబకర్ మాత్రం వ్యాపారం చేస్తూ.. విభిన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. లాభాపేక్ష లేకుండా నడపనున్న వైద్యశాల ఏర్పాటుకుఅవసరమైన అధ్యయనం కోసంనగరానికి వచ్చిన అబుబకర్‌బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు.ఆ వివరాలివీ.
సాక్షి, సిటీబ్యూరో : ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం అఫ్ఘానిస్థాన్‌లో సగటు జీవితకాలం 51.3 సంవత్సరాలే. 223 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అఫ్ఘానిస్థాన్ 221వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం కేన్సర్. గడచిన పదేళ్ళలో ఈ రోగుల సంఖ్య భారీగా పెరిగింది. అత్యధికులు కొలొన్ క్యాన్సర్ బారినపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది ఫోర్త్ స్టేజ్ దాటిన తర్వాత మాత్రమే తమకు క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించగలుగుతున్నారు. అఫ్ఘాన్ వైద్యవిద్యలో నాణ్యత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజూ ఐదు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణికుల్లో 90 శాతం మంది రోగులో, వారి సహాయకులో ఉంటున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అబుబకర్ కాబూల్‌లో ఓ ఆస్పత్రి నిర్మించాలని భావించారు.
కాబూల్‌లో ఆస్పత్రినిర్మాణానికి...
ప్రాణాంతక వ్యాధుల్ని గుర్తించడం, వాటికి వైద్యం చేయించుకోవడానికి అఫ్ఘానిస్థాన్‌లో అవసరమైన సదుపాయాలు లేవు. దీనికోసం పాకిస్థాన్‌కో, భారత్‌కో రావాల్సిందే. అక్కడి పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం ఏటా 200 మంది రోగులకు పూర్తి ఖర్చులు భరించి ఉచిత చికిత్స అందిస్తోంది. ఈ రోగుల్ని అక్కడి భారత రాయబార కార్యాలయం గుర్తించి సిఫార్సు చేస్తుంది. ఇలానే ఆ దేశంలో రాయబార కార్యాలయం ఉన్న ప్రతి దేశమూ సహాయం చేసేలా అబుబకర్ చొరవ తీసుకున్నారు. ప్రతి ఎంబసీకి వెళ్లి అ«ధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈయన కుటుంబం అఫ్ఘానిస్థాన్ రక్షణ దళాల్లో పని చేయడంతో పాటు రాజకీయంగానూ పేరుంది. అబుబకర్ మేనమామ ఖలీల్ మసూద్ గతంలో అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న ఓ ప్రావెన్సీకి గవర్నర్‌గా పని చేసి ప్రస్తుతం స్వీడన్‌లో రాయబారిగా ఉన్నారు. కాబూల్‌లో ఓ ఆస్పత్రి నిర్మించడం ద్వారా కేన్సర్ రోగులకు సేవ చేయాలని అబుబకర్ నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం స్థోమత ఉన్న వారి నుంచే చార్జీలు వసూలు చేస్తూ, పేదలకు పూర్తి ఉచితంగా సేవలు చేయాలన్నది ప్రతిపాదిత ఆస్పత్రి లక్ష్యం.
బైక్‌పై తిరుగుతూ అధ్యయనం..
కాబూల్‌లో నిర్మించే ఆస్పత్రి ఎలా ఉండాలి? అక్కడ పని చేసే వారికి ఎలాంటి శిక్షణలు ఇప్పించాలి? ఏయే ఉపకరణాలు సమీకరించుకోవాలి? తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేయడం కోసం అబుబకర్ భారత్‌కు చేరుకున్నారు. 2003లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎంబీఏ చేసి ఉండటంతో పాటు గతంలో నాలుగుసార్లు పర్యాటకుడిగా వచ్చి వెళ్లడంతో ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ చేరుకున్న ఆయన అక్కడ నుంచి బైక్‌పై కన్యాకుమారి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రయాణంలో వివిధ నగరాల్లో ఉన్న కేన్సర్ ఆస్పత్రుల్ని సందర్శిస్తూ వైద్యలను కలవడంతో పాటు ఇతర అంశాలు అధ్యయనం చేస్తున్నారు. వైద్య ఖర్చులు ఢిల్లీ కంటే హైదరాబాద్‌లోనే తక్కువని తెలుసుకున్న అబుబకర్ నగరానికి ప్రాధాన్యం ఇస్తూ బుధవారం ఇక్కడకు వచ్చారు. దాదాపు మూడు వారాల పాటు ఇక్కడే ఉండి వివిధ కేన్సర్ ఆస్పత్రులను సందర్శించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. నగర ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా పని చేస్తున్న అనిల్ కుమార్ గతంలో కాబూల్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈయనతో అబుబకర్‌కు పరిచయం ఉంది. దీంతో బుధవారం ట్రాఫిక్ కమిషనరేట్‌కు వచ్చిన అబుబకర్ ట్రాఫిక్ చీఫ్‌తో భేటీ అయ్యారు. ఏయే ఆస్పత్రుల్ని సంప్రదించాలనే విషయాన్ని అనిల్‌కుమార్ ద్వారా తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment