పప్పీకి పెద్ద కష్టం! | Cancer Spreads To Pet Dogs In hyderabad | Sakshi
Sakshi News home page

పప్పీకి పెద్ద కష్టం!

Published Fri, Aug 10 2018 8:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Cancer Spreads To Pet Dogs In hyderabad - Sakshi

హిమాయత్‌నగర్‌: ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఇంటి నేస్తానికి పెద్దకష్టం వచ్చింది. మనుషులను పీక్కుతింటున్న కేన్సర్‌ ఇప్పుడు పెంపుడు శునకాల ప్రాణాలను హరిస్తోంది. కలివిడిగా తిరిగే ఆ ప్రాణులకు ఏం జరిగిందో తెలుసుకునే లోగానే మృత్యువాత పడుతున్నాయి. గడచిన ఆరునెలల్లో నగర వ్యాప్తంగా సుమారు 150 నుంచి 200 పెంపుడు శునకాలు ఈ వ్యాధితో చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. కుక్కల్లో వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమిస్తున్నట్టు గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. 

నెలకు 20–30 కేసులు నమోదు
ఇటీవల కాలంలో నారాయణగూడలోని సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు అనారోగ్యంతో ఉన్న పెంపుడు శునకాలను తీసుకువచ్చి పరీక్షలు చేయిస్తున్నారు. వీటిలో నెలకు ఐదారు కేన్సర్‌ కేసులు నమోదవుతున్నట్టు అక్కడి వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఇతర హాస్పిటల్స్‌తో కలిపి మొత్తం 20–30 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నట్టు గుర్తించారు. నారాయణగూడ హాస్పిటల్‌లో కీమోథెరపీలో స్పెషలైజేషన్‌ చేసిన వైద్యులు లేనందున ఇక్కడ నుంచి రాజేంద్రనగర్‌ పీవీ నరసింహారావు వెటర్నరీ హాస్పిటల్‌కు రిఫర్‌ చేస్తున్నారు. ఇదిలావుంటే.. తమ వద్ద కీమో సేవలు లేవంటూ అక్కడికి వస్తున్న కేసులను నారాయణగూడకు రిఫర్‌ చేస్తున్నారు. దీంతో ఎక్కడా సరైన వైద్యం అందక.. కేన్సర్‌ నయంకాక పదిరోజుల్లోనే శునకాలు చనిపోతున్నాయి. 

ఆరు విభాగాల్లో కేన్సర్‌ గుర్తింపు
నారాయణగూడ హాస్పిటల్‌కు వచ్చే పెంపుడు శునకాలకు టెస్ట్‌లు చేసి వాటిలో ‘టీవీజీ, లంగ్‌ క్యాన్సర్, స్కిన్‌ ట్యూమర్, ఓరల్‌ క్వాలిటీ, లైపోమా, మెమ్మరీ’ వంటి వాటిని ‘ఫైన్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌’ సైకాలజీ (ఎఫ్‌ఎన్‌ఏ) టెస్ట్‌ ద్వారా గుర్తిస్తున్నారు.

ఈ టెస్ట్‌ రాష్ట్రం మొత్తం మీద ఈ ఆస్పత్రిలోనే చేరని, ఇవన్నీ కేన్సర్‌ రోగాలేనని డాక్టర్‌ బోధ స్వాతిరెడ్డి తెలిపారు. ఈ టెస్ట్‌ల్లో శునకానికి ‘బినైన్‌’ అని తేలితే కేన్సర్‌ వచ్చిన ప్రాంతాన్ని సర్జరీ ద్వారా తీసేస్తున్నారు. అదే ‘మ్యాలిగ్నేట్‌’ అని తేలితే మాత్రం కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ చికిత్స లేకపోవడంతో జబ్బు నయంకాక శునకాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. 

కేన్సర్‌కు ఇవీ కారణాలు..  
పెంపుడు శునకాల్లో తరచుగా వస్తున్న పలు రకాల కేన్సర్లను వైద్యులు గుర్తించారు. అవేంటంటే.. ఆడ కుక్కల అండాశయాలు ‘ఈస్ట్రోజన్‌’ అనే హార్మొన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పిల్లలు పుట్టకుండా ఆపేయడం వల్ల ఈ హార్మోన్‌ గతి తప్పుతుంది. దీనివల్ల శునకానికి బ్రెస్ట్‌ కేన్సర్‌ వ్యాపిస్తుంది. పిల్లలు వద్దనుకుంటే ఫ్యామిలీ ప్లానింగ్‌ ఆపరేషన్‌ చేయిస్తే ఈ ముప్పు ఉండదని వైద్యులు చెబుతున్నారు.  
‘వెనిరీయల్‌ గ్రాన్యులోమా’ లోపం ఉన్న ఆడ, మగ శునకాలను క్రాసింగ్‌ చేయించడం వల్ల కేన్సర్‌ వ్యాప్తి చెందుతుంది. ఆడ శునకాన్ని మగ శునకంతో క్రాసింగ్‌ చేయించాల్సి వస్తే ముందుగా వైద్యుడి సూచనలు తీసుకోవాలంటున్నారు.  
శునకం తినే ఆహారంలో కలిసే ప్లాస్టిక్, రోజుల తరబడి నిల్వ ఉన్న నీరు తాగిన కారణంగా పలు రకాల క్యాన్సర్లు వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. దీంతో పాటు మనం ఇంట్లో పెట్టే ఫుడ్‌లో కొన్ని కెమికల్స్‌ కలవడం వల్ల కూడా ఈ మహమ్మారి వస్తున్నట్టు నిర్థారించారు.  
కేన్సర్‌ ఉన్న శునకంతో మేటింగ్‌(క్రాసింగ్‌) చేయిస్తే దానికున్న జబ్బు మరో కుక్కకు వ్యాపిస్తుందంటున్నారు. శునకం జీన్స్‌లో వస్తున్న అనుకోని మార్పుల వల్ల కూడా మనం కనిపెట్టలేని విధంగా వ్యాధి చంపేస్తుందంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై 31 వరకు నారాయణగూడ వెటర్నరీ ఆస్పత్రిలో 35 కేన్సర్‌ కేసులు నమోదైనట్టు ఇక్కడి వైద్యులు తెలిపారు. ఇందులో 50 శునకాలు మృత్యువాత పడుతున్నాయన్నారు. 

చాలా వరకు రికవరీ..
నారాయణగూడ హాస్పిటల్‌కు నెలలో ఐదారు కేన్సర్‌ కేసులు వస్తున్నాయి. ‘బినైన్‌’ కేసులను సర్జరీల ద్వారా నయం చేస్తున్నాం. మ్యాలిగ్నేట్‌ వచ్చి న వాటిని రాజేంద్రనగర్‌కు రిఫర్‌ చేస్తున్నాం. మా వద్దకు వస్తున్నవాటిలో పెంపుడు శునకాలే కేన్సర్‌కు గురవుతున్నాయి.    – డాక్టర్‌ బోధ స్వాతిరెడ్డి, ల్యాబ్‌ ఇన్‌చార్జి 

చచ్చిపోతున్నాయి..
నగర వ్యాప్తంగా ఉన్న వెటర్నరీ హాస్పిటల్స్‌లో నెలకు 30 కేన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో సుమారు 200 శునకాలు ఈ వ్యాధితో మృతి చెందాయి.
    – డాక్టర్‌ బి.భగవాన్‌రెడ్డి, రిటైర్డ్‌సూపరిటెండెంట్, జిల్లా అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement