ఆపరేషన్ తర్వాత, ఆపరేషన్‌కు ముందు
సుల్తాన్‌బజార్ : ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన కోమరయ్య కుమారుడు శ్రీను(22) పుట్టుకతో అంతుచిక్కని వ్యాధి బారినపడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతని శరీరమంతా నల్లని మచ్చలు ఏర్పడ్డాయి.తలపై కేన్సర్ గడ్డ కూడా ఏర్పడింది. కుటుంబ సభ్యులు 2011లో నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జె కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స చేసి తొలగించారు.తరువాత (రెండు సంవత్సరాల క్రితం) ఈ వ్యాధి తిరగబడింది. గతంలో తలపై ఏర్పడిన చోటే తిరిగి గడ్డ ఏర్పడింది. మెల్ల మెల్లగా మెదడు వరకు ఏర్పడింది.
10 రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ నాగప్రసాద్ అతనికి శస్త్ర చికిత్స నిర్వహిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి నాగప్రసాద్, అనస్టీసియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పాండునాయక్, న్యూరో సర్జరి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్‌రెడ్డిల నేతృత్వంలో వైద్య బృందం సుమారు 4 గంటలపై శ్రమించి శ్రీను తలపై నుంచి మెదడువరకు పేరుకుపోయిన కేన్సర్ గడ్డను తొలగించి తొడపై నుంచి చర్మాన్ని తీసి తలపై అతికించి చికిత్స విజయంతంగా నిర్వహించారు. దీంతో వైద్యులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అభినందించి సత్కరించారు.
రోగి జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం
తలపై కేన్సర్ గడ్డ పేరుకుపోయిన శ్రీనుకు రెండు రోజుల క్రితం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అతని జీవన ప్రమాణాన్ని పెంచగలిగాం. ప్రాణాంతకమైన ఈ వ్యాధిని వైద్య పరిభాషలో జీరో ధర్మ పెగ్మెంటోజో అని అంటారు. 3 లక్షల మందిలో ఒకరికి ఈ వ్యాధి అరుదుగా వస్తుంది. కొందరికి ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. 20 ఏళ్లలో ఇలాంటి ప్రాణాంతక వ్యాధితో ఎవ్వరూ రాలేదు. మొదటిసారిగా ఇలాంటి కేసు రావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 3 రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టి ఆ తర్వాత ఇంటికి పంపించాం.
– డాక్టర్ నాగప్రసాద్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి
Comments
Please login to add a commentAdd a comment