చిట్టి దేశం.. ‘బీటీ’ని పాతరేసింది!
• ఆఫ్రికాలోని బుర్కినాఫాసో విజయగాథ
• నల్లగొండ రైతుల ఆత్మహత్యలను అధ్యయనం చేసి మేల్కొన్న తీరు
• పడగవిప్పిన మోన్‌శాంటోకు వణుకు పుట్టించిన వైనం
• మహిళా రైతుల విజయగాథపై అధ్యయనం కోసం మళ్లీ వచ్చిన బృందం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, ఆఫ్రికాలోని బుర్కినాఫాసో దేశం.. ఈ రెండింటికీ ఓ అవి నాభావ సంబంధం.. ఇది ఆ దేశ రైతులను రక్షించిన అనుబంధం.. చిత్రంగా ఉన్నా ఇది నిజం. బుర్కినాఫాసో మన ఉమ్మడి ఏపీ విస్తీర్ణం కంటే చిన్న దేశం. జనాభా కోటీ డెబ్బై లక్షలు. కానీ ప్రపంచాన్ని గుప్పిట్లో ఉంచుకున్న బహుళజాతి కంపెనీ మోన్‌శాంటోను తరిమి కొట్టింది. బీటీ విత్తనాలతో రైతుల ఉసురు తీస్తున్న ఆ కంపెనీని జాడ లేకుండా వెళ్లగొట్టింది. ఆ దేశ సాగు విస్తీర్ణంలో 75 శాతం మోన్‌శాంటో విత్తనాలే ఉన్న స్థాయి నుంచి రెండేళ్లలో ఒక్క బీటీ విత్తనం కూడా కనిపించని స్థితికి రాగలిగింది.
నల్లగొండ జిల్లా పత్తి రైతుల ఆత్మహత్యలకు బీటీ పత్తి కారణమన్న విషయం తెలుసుకోవడమే వారి విజయానికి కారణం. రైతుల ఆత్మహత్యల ప్రస్తావన రాగానే తెలంగాణ పేరు వినిపిస్తుం ది. సరైన దిగుబడి లేక, అప్పు తీర్చే మార్గం కానరాక రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. వీరిలో ఎక్కువ శాతం బీటీ పత్తి సాగుచేసే రైతులే. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంద ని, చీడపీడలు ఆశించవని ఎన్నో ఆశలతో బీటీ పత్తి సాగు చేస్తున్న రైతులు.. ఆశించిన దిగు బడి లేక అప్పుల పాలై, అవి తీర్చలేక ప్రాణా లు తీసుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితి నుంచి బుర్కినాఫాసో బయటపడింది.
మెల్లమెల్లగా విస్తరించిన ‘బీటీ’భూతం
బుర్కినాఫాసో ప్రధాన ఆదాయ వనరు పత్తి. నాణ్యమైన పత్తిని విదేశాలకు ఎగుమతి చేస్తుం ది. అలాంటి ఆ దేశంలోకి 2002లో మోన్‌శాం టో అడుగుపెట్టింది. బీటీ పత్తి విత్తనాలతో దిగుబడి పెరగడంతోపాటు సాగు ఖర్చు తగ్గు తుందంటూ ప్రచారం చేసింది. అక్కడి అధికా రులు, దళారులను మచ్చిక చేసుకుని రైతుల కు బీటీ విత్తనాలు అంటగట్టింది. పత్తి సాగును తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. అక్కడ 10 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుండగా.. 7.5 లక్షల హెక్టార్లలో బీటీ పత్తి వేయడం గమనార్హం. కానీ కొద్దికాలంలోనే ఆ విత్తనాల డొల్లతనం బయటపడింది. చీడపీడలు ఆశించి, ఎరువుల ఖర్చు పెరిగిం ది. నాణ్యత దెబ్బతిని, దిగుబడి తగ్గింది. దీంతో ఎగుమ తులు తగ్గి, ఉపాధి దెబ్బతిన్నది.
‘నల్లగొండ’ను చూపిన కెనడా సంస్థ
కెనడాకు చెందిన ‘ఇంటర్ పారెస్’ అనే సంస్థ జన్యుమార్పిడి వంగడాల దుష్పరిణామాలపై అధ్యయనం చేస్తూ, సదస్సులు నిర్వహిస్తుం టుంది. ఆ సదస్సులకు తెలంగాణకు చెందిన ‘దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ’ ప్రతినిధులు హాజరయ్యారు. బీటీ పత్తి సాగుతో నష్టపోతు న్న తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్న విషయాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఇంటర్ పారెస్ ప్రతినిధి ఎరిక్.. ఓ అధ్యయనంలో భాగంగా బుర్కినాఫాసో వెళ్లినప్పుడు అక్కడి రైతు సంఘాలకు వివరించారు. దాంతో బుర్కినాఫాసో రైతు సంఘం నేత ఉమారూ నేతృత్వంలో ఓ బృందం 2012, 2014ల్లో నల్లగొండ జిల్లాకు వచ్చి పరిశీలించింది.
ఆత్మ హత్య చేసుకున్న పత్తి రైతుల కుటుంబాలను సంప్రదించింది. బీటీ పత్తి కారణంగా జరిగిన నష్టం, బాధలు తెలుసుకుంది. తమ దేశంలో ఇలాంటి దుష్పరిణామాలు నెలకొనకుండా మోన్‌శాంటోను తరిమికొట్టాలని నిర్ణయించు కుంది. అక్కడి 250 సంఘాలతో సంఘటిత శక్తిగా మారిన రైతులు.. బీటీ పత్తిపై పోరాటం ప్రారంభించారు. వారి ప్రభుత్వం కూడా దిగి రావడంతో మోన్‌శాంటో బుర్కినాఫాసో నుంచి పలాయనం చిత్తగించింది. ఆ కంపెనీ విత్తనాల వల్ల ఒకే ఏడాది దాదాపు రూ.650 కోట్లకుపైగా నష్టాలు వచ్చాయని, ఆ మేరకు కంపెనీ తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ బుర్కినాఫాసో రైతులు ఫ్రాన్స్‌లోని కోర్టులో వ్యాజ్యాలు నడుపుతున్నారు.
మళ్లీ తెలంగాణ పర్యటనకు..
బీటీ పత్తి దుష్పరిణామాలపై కళ్లు తెరవడానికి తెలంగాణ పర్యటన కారణం కావడంతో బుర్కినాఫాసో దేశ రైతు సంఘాలు ఈ ప్రాంతంపై సానుభూతితో ఉన్నాయి. తాజాగా ఇక్కడి మహిళా రైతులు, సంఘాల విజయగా«థను పరిశీలించి బుర్కినాఫాసోలో అమలు చేసేందుకు మరోసారి తెలంగాణకు వచ్చాయి. ఇంటర్ పారెస్ సంస్థ ప్రతినిధి ఎరిక్ ఆధ్వర్యంలో బుర్కినాఫాసోకు చెందిన కాడిడ్జ్ కోన్, ఘనాకు చెందిన ఆస్సటా యట్టారా, సెనెగల్‌కు చెందిన ఫాటో సా తదితరులు డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీకి వచ్చారు. ఆ సంస్థ డైరెక్టర్ సతీశ్ ఆధ్వర్యంలో సాగులో మహిళల పాత్ర, మహిళా సంఘాల ప్రాధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. పశ్చిమాఫ్రికా దేశాల్లోని మహిళలు వ్యవసాయంలో చురుగ్గా లేరని, తెలంగాణలోని పరిస్థితుల అధ్యయనం తర్వాత తాము ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంటామని తెలిపారు.
రైతులు మేల్కొనాలి
‘బుర్కినాఫాసో విజయాన్ని చూసి తెలంగాణ రైతాంగం మేల్కొనాలి. వెంటనే బీటీ పత్తి సహా ఇతర జన్యుమార్పిడి వంగడాల వాడకం మానుకుంటేనే మనుగడ ఉంటుంది. సాధారణంగా పరిస్థితులు కార్పొరేట్ కంపెనీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఆఫ్రికా రైతులు దాన్ని అధిగమించి జీవితాలను బాగు చేసుకున్నారు. ఇక్కడ కూడా రైతులు బీటీ సాగును వదిలించుకుంటేనే మేలు కలుగుతుందని గుర్తించాలి..’’ – సతీశ్, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్