ఖైదీని పట్టించిన సర్వే
సమగ్ర సర్వే పుణ్యమా అని తొమ్మిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఓ ఖైదీ పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్‌కు చెందిన ఒడ్డే(దనుల) వెంకట్రాములు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ కొన్నేళ్ల కిందట మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు.
అతడికి మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్లపాటు జైలులో శిక్షను అనుభవించిన వెంకట్రాములు.. 2005లో 15రోజులపాటు పెరోల్‌పై బయటికి వచ్చాడు. గడువు ముగిసినా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎంతవెతికినా ఆచూకీ లభించకపోవడంతో మహారాష్ట్ర పోలీసులు నిజామాబాద్ జిల్లా పోలీసులను ఆశ్రయించారు. సర్వేలో పాల్గొనేందుకు వెంకట్రాములు స్వగ్రామానికి వచ్చినట్లు నిజాంసాగర్ ఎస్‌ఐకి ఉప్పందింది. దీంతో ఆయన వెంకట్రాములును అదుపులోకి తీసుకున్నారు.