ఈ నెల 29న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 29న జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజున కృష్ణా నదీ జలాల అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వాదనలు వినిపించాల్సి ఉండ డంతో ముఖ్య అధికారులంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. దీంతో సమావేశం జరగడం కష్టమేనని తెలుస్తోంది. తమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి 28 నుంచి 3 రోజుల పాటు అందుబాటులో ఉండరని, ఇతర అధికారులు సైతం సుప్రీం కేసు విషయమై ఢిల్లీలో ఉండనున్నారని శుక్రవారం తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేయాలని లేఖలో కోరారు. తమ అధికారులూ ఢిల్లీలో ఉండే అవకాశం దృష్ట్యా ఏపీ సైతం సమావేశాన్ని వాయిదా వేయించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.