సాక్షి, మంచిర్యాల : అదే నిరాశ.. అంతే నిస్పృహ. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటనతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ‘సీఎం వస్తా రు.. వరాలిస్తారు..’ అని ఎంతో ఆతృత తో ఎదురుచూసిన ప్రజలకు మళ్లీ నిరాశే మిగిలింది. ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు మూడోసారి వచ్చిన సీఎం కేసీఆర్ జైపూర్ మండలం పెగడపల్లిలో నిర్మించతలపెట్టిన సింగరేణి పవర్ ప్లాంటు కు రావడం రెండోసారి. తొలి పర్యటన మాదిరిగానే రెండో పర్యటనలోనూ సీఎం పవర్ ప్లాంటుకే పరిమితమయ్యారు. మీడియా, ప్రజలతో దూరంగా గడిపారు. విద్యుత్ ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా.. ఆ ప్రాంతంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1200మెగావాట్ల విద్యుత్ ఉత్పాదిత ప్లాంటు విస్తరణలో భాగంగా మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
జిల్లా ప్రగతి.. ప్రధాన సమస్యలపై నోరు మెదపలేదు. సిర్పూర్ పేపర్ మిల్లు మూతబడి.. అందులో పని చేసే నాలుగు వేల మంది కార్మికులు.. వారి కుటుంబాలు ఏడు నెలలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నా.. వారిని ఆదుకునే విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు.. గూడెం ఎత్తిపోతల పధకాలు పూర్తయి నాలుగు నెలలు దాటింది. డిసెంబర్ 25న సీఎం రెండోసారి జిల్లాకు వచ్చారు. ఆ సమయంలోనే వీటి ప్రారంభోత్సవాలు జరగాల్సి ఉండగా కార్యరూపం దాల్చలేదు.
మూడోదఫా జిల్లాకు వచ్చిన సీఎం ఈసారీ ప్రాజెక్టులు ప్రారంభించకపోవడంతో తూర్పు ప్రాంతవాసుల్లో నైరాశ్యం నెలకొంది. పైలాన్ నుంచి కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఉన్న పవర్ ప్లాంటు నిర్వాసితులు తమకు నష్టపరిహారం ఇచ్చే విషయంలో సీఎం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు వెళ్లి నచ్చజెప్పినా శాంతించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సీఎం సమీక్ష తర్వాత నిర్వాసితుల దగ్గరికి వెళ్లి సమస్యలు విన్నారు. అందరికీ న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండున్నర గంటల పర్యటన..
ఉదయం 11.58 గంటలకు జైపూర్ పవర్ ప్లాంటుకు చేరుకున్న సీఎం మధ్యాహ్నం 2.28 గంటల వరకు అందులోనే గడిపారు. హెలికాప్టర్ దిగి నేరుగా ‘పైలాన్’ను ప్రారంభించించేందుకు వచ్చిన కేసీఆర్‌ను పండితులు వేదమంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికారు. జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, జెడ్పీ చైర్ పర్సన్ శోభా సత్యనారాయణ గౌడ్, ఎంపీ బాల్క సుమన్, పార్లమెంటరీ సెక్రటరీ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ వెంకట్రావ్, సీఎండీ చైర్మన్ శ్రీధర్, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాథోడ్ బాబురావు, రేఖాశ్యాంనాయక్, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, కలెక్టర్ జగన్మోహన్, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ తరుణ్‌జోషి సీఎంకు ఘనస్వాగతం పలికారు.
పైలాన్ ప్రారంభోత్సవం తర్వాత అక్కడ జరుగుతున్న 1200 మెగావాట్ల యూనిట్ల పనుల ప్రగతిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 12.30 నుంచి 2.10 గంటల వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, సింగరేణి ఉన్నతాధికారులు, బీహెచ్‌ఈఎల్, మెక్‌నెల్లి భారత్ కంపెనీలతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణ దశలో ఉన్న పనులు ఈ ఏడాది నవంబర్‌లోగా పూర్తి చేయాలని, తాజాగా నెలకొల్పనున్న 600 మెగావాట్ల యూనిట్ పనులు 30 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంటుకు అవసరమైన నీరు.. బొగ్గు తరలింపులో ఉన్న సమస్యను పరిష్కరించాలని.. పైప్‌లైన్ , రైల్వే లైన్ నిర్మాణం విషయంలో భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మంత్రులు, కలెక్టర్‌కు బాధ్యతలు..
జైపూర్‌కు తొలిసారిగా వచ్చిన సీఎం విద్యుదుత్పత్తి కేంద్ర పనుల పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్ జగన్మోహన్‌కు అప్పగించారు. తర్వాత కలెక్టర్ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అవి గతంలో కంటే పుంజుకున్నాయి. ప్రస్తుత పనులు పరిశీలించిన కేసీఆర్ ఇంకా పనుల పురోగతి అవసరమని భావించారు. ఈ మేరకు మంత్రులకూ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సీఎం ఆదేశాల మేరకు నెలకోసారి జైపూర్‌కు వచ్చి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తానని దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటన అనంతరం మీడియాతో చెప్పారు.
సీఎం పర్యటన ప్రశాంతం
చెన్నూర్/జైపూర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జైపూర్ పర్యటన ప్రశాంత ముగిసింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సీఎం పర్యటన వా రం రోజుల ముందు ఖరారు కావడంతో జిల్లా స్థాయి అధికారులు జైపూర్‌లో పవర్ ప్లాంట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల జిల్లా అధికారులు బుధవారం విద్యుత్ ప్లాంట్ వద్దకు ఆగమేఘాలపై చేరుకున్నారు.
సీఎంకు ఘన స్వాగతం
మూడో యూనిట్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీధర్, పర్యావరణ, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ, న్యాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, రేఖానాయక్, కోనేరు కొనప్ప విఠల్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, జెడ్పీచైర్‌పర్సన్ శోభారాణి, వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి, కలెక్టర్ జగన్మోహన్, ఎంపీపీ మెండ హేమలత, జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, వైస్ ఎంపీపీ శీలం లత, సర్పంచులు భీమిని రాజయ్య, రిక్కుల రాజమణి, రిక్కుల అమృతమ్మ, ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
మళ్లీ నిరాశే...!
Published Wed, Mar 4 2015 3:29 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement