‘స్థానికం’ ఆశలు నెరవేరేనా? | Nine districts ... mlc 12 spaces! | Sakshi
Sakshi News home page

‘స్థానికం’ ఆశలు నెరవేరేనా?

Published Thu, Aug 27 2015 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

‘స్థానికం’ ఆశలు నెరవేరేనా? - Sakshi

‘స్థానికం’ ఆశలు నెరవేరేనా?

సాక్షి, హైదరాబాద్: మండలి ‘స్థానిక సంస్థల’ కోటా స్థానాల ఎన్నికలు ఏరోజుకారోజు వెనక్కి వెళుతుండడంతో ఆశావాహులు నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల ఆశలు ఇప్పట్లో తీరేలా కన్పించడం లేదు. ప్రభుత్వ నామినేటెడ్ పదవులపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టకపోవడంతో కనీసం ‘స్థానిక’ కోటాలో ఎమ్మెల్సీ కోసం అయినా ప్రయత్నించవచ్చని ఎదురుచూస్తున్న వారికి నిరాశ తప్పడం లేదు.
 
తొమ్మిది జిల్లాల్లో ... 12 ఖాళీలు!
స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వారు గతేడాది మే1న పదవీ విమరణ చేశారు. దీంతో 9 స్థానాలు ఖాళీ అయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం, ఆయా జిల్లాల జనాభాను పరిగణలోకి తీసుకోగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానం అదనంగా పెరిగింది. వీటితో కలిపి ప్రస్తుతం మొత్తం 12 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేయడంలో ఈసీ తీవ్ర జాప్యం చేస్తోంది. వాస్తవానికి  ఈ నెలాఖరుకల్లా ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవుతాయని ఈసీ అధికారుల నుంచి ప్రకటనలు వెలువడడ్డాయి. కానీ నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు.
 
గులాబీ నేతల ఎదురుచూపులు: పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, పదవీయోగం దక్కని పలువురు సీనియర్లు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. మూడునెలల కిందట జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం దక్కని కొందరు నేతలు కూడా ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా జిల్లాల్లో గతంలో స్థానిక ఎమ్మెల్సీలుగా ఉండి టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకున్న వారూ ఈసారి అవకాశం కోసం పడిగాపులు గాస్తున్నారు.

నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవ ర్గం నుంచి ఎమ్మెల్సీగా పనిచేసిన నేతి విద్యాసాగర్‌కు ఈ ఏడాది జూన్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం దక్కింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు సైతం ఇదివరకు వివిధ పార్టీల నుంచి స్థానిక కోటాలో మండలికి ఎన్నికై వచ్చి గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు.

మే1న పదవీ విరమణ చేసిన వీరంతా మళ్లీ మండలిలో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.  ఆదిలాబాద్, నిజామాబాద్ టీఆర్‌ఎస్‌కు చెందినవారు, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని రెండో స్థానానికి ఇతర పార్టీల నుంచి వచ్చినవారు ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారే. నల్లగొండ జిల్లాలోనూ టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఓ నేత ఎపుడెపుడు ఎన్నికల ప్రకటన వస్తుందా? అని రోజులు లెక్కపెడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement