చతికిల పడ్డ అధికార పక్షం
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో నిర్లిప్తత ఆవరించిందా? పాలకపక్షంపై దూకుడు పెంచిన విపక్షాల దాడిని తిప్పి కొట్టలేక టీఆర్‌ఎస్ ఆత్మరక్షణలో పడిపోయిందా? ఇటీవలి పరిణామాలు, అధికార పార్టీ నేతల తీరును పరిశీలిస్తున్న వారు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఒక్క ముక్కలో ‘అధికార పక్షం చతికిల పడింది’ అని తేల్చేస్తున్నారు. అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా నాయకుల పనితీరును గమనిస్తే ఎవరికి వారు అన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, మంత్రులు అయిన వారు, వల సొచ్చి పార్టీ బలం పెరగడానికి దోహదం చేసి న వారికి మినహా, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి పదవులు దక్కలేదని అంటున్నారు.
పదవుల్లేక సీనియర్లలో అసంతృప్తి..
అయితే పార్టీ నాయకత్వం తీరుపై పీకల్దాక అసంతృప్తితో ఉన్న వారు బహిరంగంగా ఎక్కడా బయట పడడం లేదు. అధినేత, సీఎం కేసీఆర్‌ను కాదని పార్టీలో ఎవరూ ఎవరికీ ఏమీ చేయలేని పరిస్థితుల నేపథ్యంలో తమలో తామే మథన పడుతున్నారు. చివరకు మంత్రులూ ఏమీ చేయలేక చేతులు ఎత్తేయడం సీనియర్లను నిరాశకు గురిచేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక తమకు పదవులు వస్తాయని వీరంతా ఆశగా ఎదురు చూశారు. నామినేటెడ్ పదవుల భ ర్తీ విషయాన్ని పక్కన పెడితే, చివరకు పార్టీ పదవులూ లేకపోవడాన్ని పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి తోడు జిల్లాల్లో మంత్రులు ఒంటెద్దు పోకడతో తమను కలుపుకొని పోవ డం లేదన్న ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
కార్యకర్తలకు మొండిచేయి..
పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మొండిచేయి చూపుతున్నారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కనీసం తమ దగ్గరి కార్యకర్తలకు సైతం ఏ పనులు చేయలేక పోతున్నారని అంటున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నేళ్లు పనిచే సినందుకు తమకు కనీసం గుర్తింపు లేకుండా పోయిందన్న అసంతృప్తి కార్యకర్తల్లో ఉంది. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీ ఇన్‌చార్జులు ఉన్నా, వారికీ ప్రాధాన్యం దక్కడం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీలో ఏనాడూ కనిపించని ఆయా మంత్రుల బంధుగణం సంఖ్య పెరిగిపోయి అన్నింటా వారిదే పెత్తనం కావడాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీర్ణించుకోలేక పోతున్నారు.
దొరకని కేసీఆర్ దర్శనం
ఉద్యమ నేతగా ఉన్నప్పుడు కేసీఆర్‌తో సన్నిహితంగా ఉన్న వారికి సైతం ఇపుడు ఆయన దర్శన భాగ్యం లభించడం లేదు. తమ కష్టనష్టాలను చెప్పుకుందామని వస్తున్న జిల్లాల నేతలకు అపాయింట్‌మెంటే దొరకడం లేదు. ‘పధ్నాలుగేళ్లుగా పార్టీలో పనిచేస్తున్నా కోరుకున్న ఏ పదవీ దక్కలేదు. కనీసం సీఎంకు కనిపించి పోదామని ఇంటికి వెళితే అపాయింట్‌మెంట్ లేదంటూ తరుముతున్నారు..’ అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన చెందారు. సీఎం కేసీఆర్‌ను కలుసుకోవడంలో చివ రకు కొందరు మంత్రులకూ చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.
చేష్టలుడిగిన నేతలు
ప్రభుత్వ విధానాలపై ఇటీవల విపక్షాలు బాగా దూకుడు పెంచాయి. కానీ, వివిధ కారణాల వల్ల అధికార పక్షం నుంచి ప్రతిపక్షాలకు సరైన కౌంటర్ లేకుండా పోయింది. ప్రాణహిత-చేవెళ్లపై ప్రజా సంఘాలు, అంగన్‌వాడీ, కాంట్రాక్టు కార్మికులు, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్మికుల సమస్యలపై వామపక్షాలు, డబుల్ బెడ్‌రూం ఇళ్లపై టీడీపీ, కాంగ్రెస్‌లు ఆందోళన బాట పట్టాయి. కాగా, విపక్షాల దాడిని తిప్పికొట్టలేక పోయారని పార్టీ నేతలపై సీఎం మండిపడినట్లు తెలిసింది. విపక్షాల అన్ని ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెబుతానంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారని అంటున్నారు.