ఎమ్మెల్సీ భర్తీలో కేసీఆర్‌ మార్కు..! | KCR Concentrate On Mahabubabad MP Seat | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ భర్తీలో కేసీఆర్‌ మార్కు..!

Published Fri, Feb 22 2019 5:46 PM | Last Updated on Fri, Feb 22 2019 5:52 PM

KCR Concentrate On Mahabubabad MP Seat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకేవిధంగా ఆలోచనలకు పదునుపెడుతున్నారు. ఐదు ఎమ్మెల్సీ స్థానాల ప్రకటనపై కూడా ఎంతో ఆచూతూచి నిర్ణయం తీసుకుని మరోసారి తన మార్కు రాజకీయాన్ని చూపించారు. దీనిలో భాగంగానే ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఐదు మండలి స్థానాల భర్తీలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లాకు గిరిజన నేత, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన గిరిజన జిల్లా మహబూబాబాద్‌ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో సొంతం గెలుచుకోవాలన్న  ఆలోచనతోనే స్థానిక నాయకురాలైన సత్యవతికి కేసీఆర్‌ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి ఎమ్మెల్సీ సీటు కోసం సీనియర్లతో సహా ఎంతో మంది నేతలు తీవ్రంగా పోటీపడ్డారు. మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన తకెళ్లపల్లి రవీందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ రావు, నాగుర్ల వెంకటేశ్వరరావు సీటు ఆశించారు. కానీ వీరందరినీ కాదని మహబూబాబాద్‌ స్థానిక గిరిజన నాయకురాలైన సత్యవతి రాథోడ్‌ పేరును కేసీఆర్‌ ప్రకటించారు. గిరిజన సామాజిక ఓట్లు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసమే స్థానిక నాయకురాలకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సంస్థాగతంలో పట్టున్న కాంగ్రెస్‌కు చెక్‌పెట్టాలనేదే కేసీఆర్ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గిరిజన నేత కావడం, గతంలో  ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లోక్‌సభ ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఆమెకు అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్‌ సీటు కోసం సత్యవతి తీవ్రంగా పోటీపడిన విషయం తెలిసిందే. అయితే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌కు సీటు దక్కింది. రెడ్యా నాయక్‌ కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడు సత్యవతి రాథోడ్‌ రాజకీయ భవిష్యత్తుపై  ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ మాట నిలుపుకున్నారు. కాగా ఆమె ఎంపిక వూహాత్మకంగానే జరిగినట్లు జిల్లాలోనే నేతల మధ్య చర్చజరుగుతోంది. కాగా ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్‌ అలీకి, రాష్ట్ర కురమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి, డోర్నకల్‌ మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌ పేర్లను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోస్థానాన్ని ఎంఐఎంకు ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement