గజ్వేల్: వేసవిలో వ్యవసాయానికి కరెంట్ కోతలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్, జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో కొత్తగా నిర్మించతలపెట్టిన 132/33 కేవీ, మరో ఏడు 33/11కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గజ్వేల్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ సమస్యకు గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యమే కారణమని, ఉత్తర, దక్షిణ విద్యుత్ గ్రిడ్‌లైన్‌ను తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారని మండిపడ్డారు. ఈ వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎంత ధరకైనా విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను లేవనెత్తడానికి వేదికగా వాడుకోవాల్సిన అసెంబ్లీలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు. సమస్యలపై చర్చ జరపడానికి అసెంబ్లీని ఎన్ని రోజులైనా పొడిగించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నా.. ప్రతిపక్షాలు మాత్రం తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు.