- నాలుగు జిల్లాల్లో భూముల అన్వేషణ: మంత్రి రాజయ్య
- కేంద్ర ప్రభుత్వం రూ.820 కోట్లతో ఏర్పాటు చేస్తుంది
- ఫీవర్ ఆసుపత్రిలో ఎబోలా, స్వైన్‌ఫ్లూ, డెంగీలకు ప్రత్యేక వార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) తరహా ఆసుపత్రిని నిర్మించేందుకు నాలుగు జిల్లాల్లో భూములను పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్య చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భూములు, వసతుల పరిశీలన జరుపుతున్నామని చెప్పారు. ఆ సమాచారాన్ని కేంద్రానికి పంపుతామన్నారు.
అనంతరం కేంద్ర బృందం ఆ భూములను పరిశీలించి ఒకచోట రూ.820 కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి డిజైన్ తయారు చేసే పనిలో ఉన్నామన్నారు. ఈనెల 29న రామగుండం ఏరియా ఆసుపత్రిలో నిద్ర కార్యక్రమం ఏర్పాటుచేశామని చెప్పారు. ఇక నుంచి గాంధీ ఆసుపత్రికి బదులు ఫీవర్ ఆసుపత్రిలో ఎబోలా, స్వైన్‌ఫ్లూ, డెంగీ, చికెన్‌గున్యా పరీక్షలు జరుపుతామని, అందుకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 70 స్వైన్‌ఫ్లూ కేసులు గుర్తించామని, ప్రస్తుతం ఎక్కడా స్వైన్‌ఫ్లూ కేసులు లేవని స్పష్టంచేశారు. ‘‘రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో 13 వేల స్వైన్‌ఫ్లూ క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తాం. ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో కాలేయ మార్పిడి చికిత్సను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని వివరించారు.
‘యాప్’లో వైద్య సేవల సమస్త సమాచారం..
వైద్య ఆరోగ్య సేవలపై హెల్త్‌కేర్ అప్లికేషన్ (యాప్)ను మంత్రి రాజయ్య ఆవిష్కరించారు. ఈ యాప్‌ను ‘మహీంద్ర కామ్‌వివా’ వారు రూపొందించారు.