రైతులను లూటీ చేస్తున్న పాలకులు
- పోరాటాలతోనే సమస్యలకు పరిష్కారం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐకేఎస్ జాతీయ నేతల మండిపాటు
జనగామ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులను లూటీ చేసే విధంగా ఉన్నాయని పార్లమెంట్ మాజీ సభ్యుడు, అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా విమర్శించారు. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల మైదానంలో ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. బహిరంగ సభలో హన్నన్ మొల్లా మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమంలో ఘోరంగా విఫలమయ్యాయన్నారు.
రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని గత 39 రోజులుగా ఢిల్లీలో ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు స్వమూత్ర పానం చేసినా స్పందించపోవడంతో రైతులపైపాలకులకు ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజం మాట్లాడుతూ రైతులు సంఘటితం కావాలని, పోరాటాలు చేయాలని పలుపునిచ్చారు.