వెదురు ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రైతులకు స్థిరమైన ఆదాయం సమకూర్చాలనే ప్రతిపాదనపై చర్చ జరగాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఉపాధి కోసం యువతను వ్యవసాయం దిశగా మళ్లించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఇక్కడి తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో శ్రీగంధం, వెదురు, సరుగుడు, టేకు మొక్కల పెంపకంపై ఆగ్రో ఫారెస్ట్రీ విభాగం నిర్వహిం చిన రైతు అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగం తో అనుసంధానించాలని, లేనిపక్షంలో ఆ రంగం తీవ్ర సంక్షో భంలో కూరుకుపోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుకూల వాతావరణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీంతో రైతుల పరిస్థితి మెరుగైందని పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణే అని అన్నారు. రైతులు ఆత్మహత్యల దశ దాటి ఆత్మవిశ్వాసం దిశగా పయనిస్తున్నారని నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కొత్తిమీర, పుదీనా సాగుకు ప్రోత్సాహం
కొత్తిమీర, పుదీనాను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసేందుకు ప్రత్యేకప్రాజెక్టును రూపొందించాలని ఉద్యానవన శాఖ అధికారులకు మంత్రి సూచించారు. పుదీనా, కొత్తిమీర, సుగంధగడ్డి సాగును ప్రోత్సహించేందుకు సూక్ష్మ, బిందుసేద్యంపై 95 శాతం సబ్సిడీ ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. రైతులను కోటీశ్వరులుగా చేసేందుకు ఆగ్రోఫారెస్ట్రీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఐదో విడత హరితహారంలో అటవీశాఖ సహకారంతో 20 లక్షల శ్రీ చందనం మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశిం చామని మంత్రి చెప్పారు. కేరళ నుంచి నాణ్యమైన శ్రీచందనం విత్తనాలు కొనుగోలు చేసి అటవీ, ఉద్యాన నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేసినట్లు ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్‌రాంరెడ్డి వెల్లడించారు. హరితహారంలో వెదురు, టేకు, శ్రీగంధం, సరుగుడు మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
తాత్కాలిక విషయాల మీద నిర్ణయాలు వద్దు
సాగునీటి రంగంలో పంజాబ్, హరియాణా సహా ఏ రాష్ట్రమూ తెలంగాణతో సరితూగలేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. 42 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తికి మూడు దశాబ్దాలు పట్టిందని, 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను కేవలం నాలుగేళ్లలో కొలిక్కి తెచ్చి వెట్‌రన్ చేసినట్లు చెప్పారు. ఆలస్యమైనా ఉద్యోగులకు డీఏ, పీఆర్‌సీలు వస్తాయని, కానీ వాటి ఆధారంగా ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం సరికాదని ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment