అజ్మీర్ దర్గాకు తెలంగాణ చాదర్
అధికారులను పంపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లోని ప్రఖ్యాత హజరత్ ఖాజా మొయినొద్దీన్ చిస్తీ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సమర్పించనున్న చాదర్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో మైనార్టీ శాఖ అధికారులకు అందజేశారు. దీన్ని హైదరాబాద్ పాతబస్తీలో ప్రత్యేకంగా తయారు చేయించారు. చాదర్‌పై మక్కా మదీనాచిత్రాల ముద్రణతో పాటు, ‘హండ్రెడ్స్ ఆఫ్ రిగార్డ్స్ ఫ్రమ్ కె. చంద్రశేఖర్ రావు’ అని రాయించారు. దీనితో పాటు రూ.2.51 లక్షల నజరానా కూడా దర్గాకు పంపించారు.
హైదరాబాద్ రుబాత్‌పై మాట్లాడాలని అధికారులకు ఆదేశం...
తెలంగాణ రాష్టం తరపున అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ రుబాత్ (అతిథి గృహం)పై తాజా స్థితిని అక్కడి అధికారులతో మాట్లాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరగాలని, అందరికి శుభం కలగాలని సీఎం ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్‌కు బయలుదేరిన అధికారులు
సీఎం కేసీఆర్ అందజేసిన చాదర్‌ను తీసుకొని శుక్రవారం రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర మైనార్టీ శాఖ డెరైక్టర్ జలాలుద్దీన్ అక్బర్ జైపూర్‌కు వెళ్లారు. శనివారం ప్రార్థనల అనంతరం వారు చాదర్‌ను సమర్పించనున్నారు.