
డ్రగ్స్ కేసు: వారి పేర్లు బయటపెట్టబోం!
హైదరాబాద్: నగరంలో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ ముఠాకు సంబంధించిన మరో నలుగురిని అరెస్టు చేసినట్టు రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఇందులో ముగ్గురు బీటెక్ చదువుకున్న వారు కాగా, మరో వ్యక్తి బడా గేమింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య ఏడుకు చేరుకుందన్నారు. తాజాగా అరెస్టయిన నలుగురు కూడా డ్రగ్స్ సరఫరా చేసేవారేనని స్పష్టం చేశారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన అకున్ సబర్వాల్ పలు బడా పాఠశాలలు, కాలేజీలకు చెందిన విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు అలవాటుపడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. అయితే, డ్రగ్స్ బాధితులు ఎవరినీ కూడా అరెస్టు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు. వారానికి రూ. 4వేలు ఖర్చు చేయగలిగిన వారే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు చెప్పారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విద్యార్థులు, లేదా తెలిసీ తెలియక స్నేహితుల సహచర్యం వల్ల మాదక ద్రవ్యాలు తీసుకొని ఉంటే వెంటనే ఆ విషయాన్ని వెంటనే తమ తల్లిదండ్రులకు లేదా కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులకు తెలుపాలని ఆయన సూచించారు. తాము తప్పుదారిలో ప్రయాణించిన విషయాన్ని గుర్తించి ఇకనైన సరిదిద్దుకోవాలని, ఇలాంటి తప్పుడు పనులు పునరావృతం చేయొద్దని సూచించారు. డ్రగ్స్ తీసుకొనే విద్యార్థుల పేర్లను వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెల్లడించడం లేదని, వారిని అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు.
డ్రగ్స్ ముఠా కేసు విచారణలో భాగంగా మొదట కాలేజీలు, పాఠశాలపై దృష్టి పెట్టామని, ఈ అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సినీప్రముఖులు, ఐటీ ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టి స్పష్టత ఇస్తామని తెలిపారు. విద్యార్థులు ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఏయే కాలేజీలు, పాఠశాలలకు ఎక్కువ డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాలను అరెస్టయిన డ్రగ్స్ ముఠా సభ్యుల ద్వారా తెలుసుకుంటున్నట్టు చెప్పారు.