ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో ఎంతోప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలంబాగ్ దేశంలోనే ఒక మోడల్ బస్‌స్టేషన్. ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు,కెఫెటేరియాలు, ఎంటర్‌టైన్‌మెంట్,తదితర అన్ని వసతులతో రెండంతçస్తుల్లో దీనిని కట్టించారు. 49 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 3000 బస్సులు ఆలంబాగ్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు లక్నోతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు.
సాక్షి, సిటీబ్యూరో: అది నిజాం హయాంలో కట్టించిన చారిత్రాత్మక బస్సు స్టేషన్. అప్పటి వరకు అందుబాటులో ఉన్న సాంకేతికపరిజ్ఞానంతో పూర్తిగా ఐరన్‌తో ఒక విశాలమైన డోమ్ ఆకారంలో ఎంతో అద్భుతంగా కట్టించిన మిస్సిసిపి హ్యాంగర్ (సీబీఎస్)అది. అటు హైదరాబాద్ నుంచి ఇటు సికింద్రాబాద్‌కు బస్సుల రాకపోకలకు ఎంతో అనుకూలంగా మూసీ ఒడ్డున నిర్మించిన సెంట్రల్ బస్సు స్టేషన్ రెండేళ్ల క్రితమే చరిత్రలో కలిసిపోయింది. అప్పటికే శిథిలావస్థకు చేరిన ఆ బస్సు స్టేషన్ అకస్మాత్తుగా ఒకవైపు ఒరిగిపోవడంతో దానిని తొలగించారు. చారిత్రకవారసత్వ కట్టడాలను, నమూనాలను పరిరక్షించాలంటూఇంటాక్ వంటి సంస్థలు డిమాండ్ చేశాయి. కానీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా దానిని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి రవాణామంత్రి, ఉన్నతాధికారులు సైతం మిస్సిసిపి హ్యాంగర్‌ను సందర్శించారు. శిథిలాలను పరిశీలించారు. సుమారు ఎకరం స్థలంలో విస్తరించుకొని ఉన్న మిస్సిసిపి హ్యాంగర్ స్థానంలో అధునాతన సదుపాయాలతో సరికొత్త బస్‌స్టేషన్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. కానీ రెండేళ్లు దాటినా కొత్త బస్‌స్టేషన్ నిర్మాణంపై కదలిక లేదు. మరోవైపు ఆర్టీసీ సొంతంగా ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా పబ్లిక్‌ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ‘ఆలంబాగ్’ తరహా మోడల్ బస్‌స్టేషన్ నిర్మించేందుకు అధికారులు రూపొందించిన వందలపేజీల నివేదికలపైన నిర్లక్ష్యపు నీడలు అలుముకున్నాయి.
‘ఆలంబాగ్’ ఒక నమూనా...
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్నోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలంబాగ్ దేశంలోనే ఒక మోడల్ బస్‌స్టేషన్. ఎయిర్‌పోర్టు తరహా సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, కెఫెటేరియాలు, ఎంటర్‌టైన్‌మెంట్, తదితర అన్ని సదుపాయాలతో రెండంతస్థుల్లో దీనిని కట్టించారు. 49 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 3000 బస్సులు ఆలంబాగ్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. సుమారు లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు లక్నోతో పాటు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. చారిత్రక లక్నో నగరం అందాన్ని ద్విగుణీకృతం చేసేవిధంగా ఎంతో అందంగా కట్టించిన ఈ బస్‌స్టేషన్‌లో 62 సీసీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి, రెండో అంతస్థుల్లో, గ్రౌండ్‌ఫ్లోర్‌లో వెయిటింగ్ హాళ్లు, రెస్ట్‌రూమ్‌లు, సురక్షితమైన తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. సుమారు 6 ఎకరాలు ఉన్న ఆలంబాగ్ బస్టేషన్ ప్రాంగణంలో 40 శాతం స్థలాన్ని స్టేషన్ నిర్మాణం కోసం వినియోగించగా, మరో 60 శాతం స్థలంలో 9 అంతస్థుల భవన సముదాయాలను కట్టించారు.
భారీ షాపింగ్‌మాల్స్, సినిమాహాళ్లు వంటివి ఏర్పాటు చేశారు. ఇదంతా ‘డిజైన్, బిల్డ్,ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్ఫర్’ పద్ధతిలో షాలిమార్ గ్రూపు సంస్థ నిర్మించింది. అక్కడి ఆర్టీసీ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా కట్టించిన ఈ భవనసముదాయాలపైన ఆర్టీసీకి ఏటా రూ.1.8 లక్షల ఆదాయం లభిస్తుంది. ప్రతి సంవత్సరం 5 శాతం చొప్పున ఈ ఆదాయం పెరుగుతుంది. పైగా నిర్మాణానికి ముందే ఆర్టీసీకి గుడ్‌విల్‌గా షాలిమార్ సంస్థ రూ.8 కోట్లు ఇచ్చేసింది. ఈ భవనాలను 32 ఏళ్లపాటు లీజుకు ఇచ్చారు. ఆ తరువాత ఈ భవనాలన్నీ ఆర్టీసీకే చెందుతాయి. ఇదే పద్ధతిలో హైదరాబాద్‌లో మిస్సిసిపి హ్యాంగర్ స్థానంలో కట్టించేందుకు సన్నాహాలు చేపట్టారు. మిస్సిసిపి హ్యాంగర్ స్థలంతో పాటు దాని చుట్టూ మొత్తం ఆర్టీసీకి అందుబాటులో ఉన్న 5 ఎకరాల విస్తీర్ణంలో బస్‌స్టేషన్, మాల్స్, సినిమాహాళ్లు వంటివి బిల్డ్ ఆపరేట్ ట్రాన్ఫర్ పద్ధతిలో కట్టించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారుల బృందం లక్నో సందర్శించింది. నివేదికను సైతం రూపొందించింది. అది అలాగే ఉండిపోయింది.
కన్సల్టెన్సీ ఏర్పాటు చేయాలి....
ఆర్టీసీ అధికారుల నివేదిక ఆధారంగా మిసిసిపి హ్యాంగర్ వద్ద ఉన్న ఐదెకరాల స్థలంలో ఎలాంటి డిజైన్‌లో బస్‌స్టేషన్ కట్టించాలి. షాపింగ్‌మాల్స్, ఇతరత్రా భవనాల కోసం ఎంత స్థలం అందుబాటులో ఉంటుంది. బస్‌స్టేషన్ నిర్మాణం వల్ల ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు ఏర్పడుతాయనే దానిపైన ఒక సమగ్రమైన ప్రణాళికనే రూపొందించేందుకు ఒక కన్సెల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావించారు.ఈ కన్సల్టెన్సీ ప్రణాళికల ఆధారంగా బస్‌స్టేషన్ నిర్మించేందుకు ఆసక్తి ఉన్న కన్సార్టియంల నుంచి బిడ్‌లను ఆహ్వానించవలసి ఉంది. కానీ అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు. మిస్సిసిపి హాంగర్ వద్ద కొత్త మోడల్ బస్‌స్టేషన్ నిర్మిస్తే అక్కడి నుంచి మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు, ఇటు మెట్రో స్టేషన్‌కు స్కైవేలను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. కానీ ఆచరణలో అడుగు పడడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment