కబలిస్తున్న సారా
అడ్వాలపల్లిలో అంతులేని శోకం
మత్తులో చిత్తవుతున్న జీవితాలు
సుమారు ముప్పై మంది మృతి
దిక్కులేక రోడ్డునపడ్డ కుటుంబాలు
కన్నెత్తి చూడని అధికారులు, నాయకులు
మహమ్మారిని తరిమేందుకు చర్యలు శూన్యం
మండలంలోని అడ్వాలపల్లి గ్రామాన్ని సారా రక్కసి కబలిస్తోంది. గిరిజనవాడలో చావుడప్పు మోగిస్తోంది. గ్రామంలో వందల సంఖ్యలో సారాకు బానిసలయ్యారు. పొద్దున ఇంటినుంచి బయటకెళ్లిన వ్యక్తి ఏ అర్ధరాత్రో జోగుతూ తిరిగిరావడం నిత్యకృత్యమైంది. దీంతో గ్రామంలో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికే ఈ గ్రామంలో ముప్పై మంది సారాకు బలికావడం ఆందోళన కలిగిస్తోంది. సారా వ్యసనం ఇలాగే కొసాగితే మరికొద్ది రోజుల్లో గ్రామంలోని పచ్చని కుటుంబాలు కుప్పకూలే ప్రమాదముంది.
చదువు బంద్‌జేసిన
మా నాన్న సారాయి తాగి అనారోగ్యంతో చనిపోయిండు. అప్పటినుంచి మాకు దిక్కులేకుండా అయ్యింది. నేను నాలుగో తరగతితో బడి మానేసిన. చదువుకోవాలని ఉన్నా.. పైసల్లేకు స్కూల్‌కు పోతలేను. అమ్మా, అన్నయ్య, నేను కూలికి పోతేనే పూట గడుస్తుంది. మా ఊర్లో నాలాంటి వాళ్లు చాలా మందే ఉన్నరు.
- మందారపు రమ
కూలిపని చేసి సదివిత్తాన
నా భర్త సారాకు బానిసై ఎనిమిది నెలల క్రితం సచ్చిపోయిండు. నేను, నా ఇద్దరు పిల్లలను ఆగమైనం. కూలిపని చేసుకుంట బిడ్డను సదివిత్తాన. కొడుకు బడికి వెళ్లనంటుండు. చివరివరకు తోడుంటాడనుకున్న నా భర్త మమ్ములను అనాథలను చేసి వెళ్లిపోయిండు. దిక్కులేని మమ్ముల్ని సర్కారే ఆదుకోవాలే.
- మందారపు శారద
మల్హర్ : గ్రామాల్లో నాటుసారాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు మాట లు ఆచరణకు నోచుకోవడం లేదు. అడ్వాలపల్లిలో సారా కాటుకు పదుల సంఖ్యలో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా ఒక్క రు కూడా ఇటువైపు తొంగిచూడడం లేదు. మండలంలోని మారుమూల గ్రామం అడ్వాలపల్లిలో ఎక్కువగా గిరిజన కుటుంబాలే నివాసం ఉంటున్నాయి. కూలీనాలీ చేసుకుని బతికే ఈ కుటుంబాల్లో చాలామంది పొద్దంతా పనిచేసి సాయంత్రం శారీరక శ్రమనుంచి కాస్త ఉపశమనం పొందేందుకు తాగుడు అలవాటైంది.
అది క్రమంగా వ్యవసంగా మారి యువకులు, పెద్దలు, పలువురు మహిళలు సైతం దీనికి బానిసలయ్యారు. గ్రామంలోనే చవకగా సారా లభిస్తుండడంతో నిత్యం తాగి తూలుతున్నారు. ఈ క్రమంలో పలువురు కాయకష్టం చేసి సంపాదించిన డబ్బులను తాగుడుకే తగలేస్తున్నారు. కుటుంబాలను పట్టించుకోకపోవడంతో ఇళ్లలో గొడవలు నిత్యకృతమయ్యాయి. ఇంట్లో డబ్బులు లేని సందర్భాల్లో తిండిగింజలను సైతం పోసి తాగుతున్నారు. వీరి పిల్లలు పాలేర్లుగా, పశువులు, గొర్రెలకాపరులుగా బతుకు బండిని నడుపుతున్నారు. గ్రామంలో పది మంది ఆడపిల్లలు మినహా బడికి వెళ్లేవారు కనిపించడం లేదు.
గ్రామంలో మొత్తం నలభై నాయక్‌పోడ్ కుటుంబాలు నివాసం ఉంటుండగా, ఇందులో ముప్పై కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. ఒక్కో ఇంట్లో ఇద్దరేసి చనిపోయారు. ఇది ఇలాగే కొనసాగితే గ్రామంలో వితంతువులు, పిల్లలు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ గ్రామాన్ని బాగు చేయడానికి ఎన్నడూ పూనుకున్నదిలేదు. సారాను అరికడుతామని చెప్పుకునే నేతలు, అధికారులు అడ్వాలపల్లిని ఒక్కసారి సందర్శించాల్సిన అవసరం ఉంది. పెద్ద దిక్కులేని కుటుంబాలను ఆదుకోని సారా రక్కసిని గ్రామం నుంచి తరిమేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అందరూ సహకరించాలి
గ్రామంలో చాలామం ది సారాకు బాని సలై చనిపోయారు. మరణించిన వారి కుటుం బాలను, వారి పిల్లలను చూసైనా సారా తయారీదారులు మారాలి. సారాను వదిలేసి ఇతర పనులు చూసుకోవాలి. ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తువీడి సారాను ఆరికట్టాలి. లేదంటే కొద్ది రోజుల్లో ఊర్లో మగమనిషి కనిపించకుండా అవుతుంది.
-అడ్వాల మహేష్, ఉపసర్పంచ్