సర్వే రమ్మంది | all arrangements completed for survey | Sakshi
Sakshi News home page

సర్వే రమ్మంది

Published Mon, Aug 18 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM

all arrangements completed for survey

పాలమూరు : ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్రసర్వే కోసం ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు  తమసొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లాలో 10లక్షలు కుటుంబాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదొందల నుంచి వెయ్యిమంది వరకు వలస వెళ్లినవారు ఉన్నారు. ఉపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు దాదాపు 17 లక్షల మంది మనజిల్లాకు వచ్చే అవకాశం ఉంది.
 
సర్వేపై అందరిలోనూ అయోమయం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చి తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్న వారు అయోమయంలో పడ్డారు. ఆ రోజు ఇక్కడుండాలా? సొతూరికి వెళ్లిపోవాలా? అనేదానిపై ఎటూ నిర్ధారించుకోలేక సతమతం అవుతున్నారు. ఆగస్టు 19 సమీపిస్తుండటంతో జిల్లా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఉపాధికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా తమ ఊళ్లకు చేరుకుంటున్నారు. దీంతో శనివారం, ఆదివారం జిల్లాకు హైదరాబాద్, ముంబై, పూణె నుంచి బస్సులు, రైళ్లలో ప్రయాణికులు కిక్కిరిసివస్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి.
   
అడ్డాకుల మండలం నిజాలాపూర్‌లో 2658 మంది జనాభా ఉండగా.. ఇందులో 1600 మంది వరకు గ్రామంలో ఉండగా, మిగిలిన వారంతా జీవనోపాధి కోసం వలసవెళ్లారు. వారిలో 80శాతం మంది హైదరాబాద్‌లో భవననిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. ఇతరులు బెంగళూర్, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లారు. సర్వేకోసం వారంతా ఇళ్లకు చేరుకుంటున్నారు.
   
ఖిల్లా ఘనపురం మండలం తిర్మలాయపల్లి.. గ్రామ పంచాయతీతోపాటు రోడ్డుమీది తండా, మొగుళ్లకుంట తండా పరిధిలో మొత్తం 1720 జనాభా ఉండగా.. ఇందులో 850మంది వలసవెళ్లారు. వీరిలోముంబై, పూణె, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లినవారే ఉన్నారు.నవాబుపేట మండలం పుట్టోనిపల్లితండాలో 800 జనాభా ఉండగా.. 80 శాతం మంది ముం బై, పూణెకు ఉపాధి కోసం వెళ్లారు. వారిలో ఎ క్కువ మంది సర్వే కోసం ఇంటికి వస్తుండగా.. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా వచ్చేందుకు సుముఖత చూపడం లేదు.
 
చూపాల్సిన పత్రాలివే..
సర్వేకు సంబంధించి 20 రకాల పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యజమాని పేరు, కుటుంబసభ్యుల వివరాలు, కులం, గ్యాస్ కనెక్షన్, బ్యాంకు/తపాలా ఖాతా, ఉద్యోగి వివరాలు, నెల జీతం, పింఛను పుస్తకం, ఆధార్ కార్డు సంఖ్యలు, విత్యుత్తు మీటరు సంఖ్య, వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు (సదరం), దీర్ఘకాలిక వ్యాధులు, వ్యవసాయ భూమి వివరాలు, పశుసంపద, కుటుంబ చరాస్తులు, తాత్కాలిక సంచార కుటుంబ వివరాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారి వివరాలు, ఓటరు కార్డు (18 ఏళ్లు నిడినవారు) చూపాలని కోరుతున్నారు.
 
హైదరాబాద్ నుంచి వచ్చా
నేను హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. ఈనెల 19న గ్రామంలో సర్వే ఉందని తెలిసి కుటుంబంతో సహ ఆదివారమే మా ఊరికి వచ్చాను. మాకు తెలిసిన వారు చాలా మంది ఇంకా రావాల్సి ఉంది. ఖర్చుల భారంతో కొందరు రావడానికి ఆలోచిస్తున్నారు.
 - పి.వెంకటేష్, నిజాలాపూర్, అడ్డాకుల(మం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement