భూసేకరణ బిల్లుపై అఖిలపక్షం
బిల్లు వెనక్కిరావడం ప్రభుత్వ వైఫల్యమే: షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: భూసేకరణ చట్టంలోని అంశాలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధి లేదని విమర్శిం చారు.
భూసేకరణ చట్టం 2013 రైతులకు, భూ యాజమానులకు రక్షణ కల్పిస్తోం దని, ఆ చట్టంలోని అంశాలకంటే మెరుగైన వాటితో రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెస్తే బాగుంటుందని పేర్కొన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో ఉర్దూ భాషాభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారని అన్నారు. నిజాం కుటుంబీకుల్లో ఒకరినైనా వేదిక మీదకు ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు. ఈ వైఫల్యానికి ఓయూ వైస్ చాన్స్‌లర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ సభ కోసం టీఆర్‌ఎస్ నేతలు కూలి పేరిట ఎంత వసూలు చేశారో చెప్పాలని పొంగులేటి డిమాండ్ చేశారు.