
లాల్‌దర్వాజ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు (ఫైల్)
చార్మినార్: లాల్‌దర్వాజ బోనాలకు రంగం సిద్ధమవుతోంది. సింహవాహిని అమ్మవారిఆశీస్సుల కోసం భక్తజనులు ఎదురుచూస్తున్నారు. ఆషాఢమాసంలో అత్యంత వైభవంగా జరిగే బోనాల జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 19న కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమై 29న పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపుతో ముగుస్తాయి. ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల ఉత్సవాలకు ప్రస్తుతం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 4 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ఢిల్లీలో లాల్‌దర్వాజ బోనాలు నిర్వహిస్తున్నారు. 2015లో మొదలైన ఈ జాతర ఏటా ఢిల్లీలో కనుల పండువగా జరుగుతాయి. ఈసారి మరింత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
♦ ఢిల్లీ ఉత్సవాల్లో భాగంగా జూలై 2న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
♦ జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు ఘటాల ఊరేగింపు
♦ 4న ఉదయం 11 గంటలకు అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాల సమర్పణ, పోతరాజుల స్వాగతం. సాయంత్రం 5.30 గంటలకు అంబేడ్కర్ ఆడిటోరియంలో తెలంగాణ కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు
1908లో వరదల నేపథ్యంలో..
మూసీ నదికి 1908లో వరదలు సంభవించి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వరకు వరదనీరు పోటెత్తింది. ఆ ప్రళయాన్ని చూసి నిజాం నవాబులు కంగారు పడ్డారు. వరదలో అప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి రాజా కిషన్ పర్షాద్.. లాల్‌దర్వాజ అమ్మవారి మహిమలను అప్పటి నిజాం నవాబుకు వివరించి ఆ తల్లికి పూజలు చేస్తే వరదలు తగ్గుముఖం పడతాయని సలహా ఇచ్చారు. దీంతో అమ్మవారికి నిజాం నవాబు బంగారు చాటలో కుంకుమ, పసుపు, ముత్యాలు తీసుకువచ్చి దేవాలయంలో పూజలు చేశారు. పూజల అనంతరం బంగారు చాట, కుంకుమ, పసుపు, ముత్యాలను చార్మినార్ వద్దకు వచ్చిన వరద నీటికి పూజలు చేసి విడిచిపెట్టారు. అలా చేసిన కొద్దిసేపటికే నగరంలో వరదనీరు తగ్గసాగింది. నాటి నుంచి అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 1909 ఆషాఢ మాసంలో తొలిసారిగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు. అప్పటి నుంచి ప్రతియేటా లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారికి శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
సుమారు 200 మంది కళాకారులతో ఢిల్లీకి...
లాల్‌దర్వాజ బోనాల జాతరను 2015 నుంచి ఢిల్లీలో కూడా నిర్వహిస్తున్నాం. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను దేశ వ్యాప్తంగా చాటిచెబుతున్నాం. ఇందులో భాగంగా జూలై 1న పాతబస్తీ నుంచి ఢిల్లీకి బయలుదేరుతాం. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహకారంతో దాదాపు 200 మంది కళాకారులతో ఢిల్లీ వీధుల్లో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నాం. – తిరుపతి నర్సింగ్‌రావు, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment