సాక్షి, సిటీబ్యూరో: త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, పోలీసు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో మంగళవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిశోర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్‌కు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఆర్డీఓలను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గాలున్నాయని, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మలక్‌పేట్, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయని తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. 2019 ఫిబ్రవరి 10వ తేదీ నాటికి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో 19,14,954 మంది ఓటర్లుండగా, 706 భవనాల్లో 1,809 పోలింగ్ కేంద్రాలున్నాయని, అలాగే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 19,32,926 మంది ఓటర్లు ఉండగా 770 భవనాల్లో 1,935 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 1,404 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, 552 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల తుది జాబితా ఈనెల 22వ తేదీన ప్రకటిస్తున్నందున ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు తిరిగి పునరావృతం కాకుండా పకడ్బందీచర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వారికి ఎన్నికల విధుల్లేవ్..
2019 మే 31వ తేదీకి నాటికి హైదరాబాద్ నగరంలో వరుసగా మూడేళ్లు పనిచేసిన వారిని, హైదరాబాద్ సొంతజిల్లా అయిన అధికారులను ఈ ఎన్నికల విధుల్లో నియమించడంలేదని స్పష్టం చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏసీపీ స్థాయి అధికారులను పోలీసు నోడల్ అధికారులుగా నియమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కేసుల్లో ఉన్న వ్యక్తులను బైండోవర్ చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలోఇన్‌ఛార్జి కలెక్టర్ రవి, డీసీపీలు రమేష్, అంబర్ కిషోర్ జా పాల్గొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా ఓటర్లు..
గత సంవత్సరం డిసెంబర్ 26వ తేదీనవెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితా తర్వాత కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు, తొలగించిన ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటే ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఓటర్ల సంఖ్య ఇలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment