వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయం.. బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ | Alternative To The Ventilator Is The Bag Valve Mask | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయం.. బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌

Published Wed, Apr 1 2020 3:56 AM | Last Updated on Wed, Apr 1 2020 4:00 AM

Alternative To The Ventilator Is The Bag Valve Mask - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంబ్యు బ్యాగ్‌ పరికరం డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయొచ్చని ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్ల బృందం కేంద్రానికి సూచించింది. అంబ్యు బ్యాగ్‌ డిజైన్‌ను కొద్దిగా మార్చేసి కొత్తగా తయారుచేసే ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ పరికరం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది. బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ పరికరానికి సంబంధించి ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తితో పాటు మెకానికల్, ఏరోస్పేస్‌ విభాగం ప్రొఫెసర్‌ ఈశ్వరన్‌ ఇటీవల పలు ప్రతిపాదనలు చేశారు. వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఈ మాస్కుల తయారీకి కార్యాచరణ సిద్ధం చేసేందుకు డీఆర్‌డీవో లేదా కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం నిపుణులతో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో కరోనా ద్వారా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయాన్ని ప్రొఫెసర్‌ బృందం గుర్తు చేసింది.

తక్కువ ఖర్చుతోనే..
రోగులకు కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్ల కొరత, వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో తయారయ్యే వెంటిలేటర్ల నమూనాలపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు డిజైన్లపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌ బృందం ప్రతిపాదిస్తున్న బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌లను విద్యుత్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఉపయోగించొచ్చు. కారులోని బ్యాటరీ వంటి వాటికి ఈ మాస్క్‌లను అనుసంధానం చేసి నడిపించొచ్చు. వెంటిలేటర్‌ తరహాలో భారీ మెషీన్‌ కాకపోవడంతో దీనికి ఒకచోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం చాలా సులువు. దీని తయారీకి కేవలం రూ.5 వేల లోపు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ఐఐటీ హైదరాబాద్‌ బృందం అంచనా వేస్తోంది. త్రీడీ ప్రింటర్ల ద్వారా తయారు చేసే బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌ల నమూనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే త్రీడీ ప్రింటు సాంకేతికత ద్వారా పరిమిత సంఖ్యలోనే తయారుచేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, ఇవి నిరంతరాయంగా పనిచేయకపోవచ్చనే అనుమానాలనూ ఈ బృందం వ్యక్తం చేసింది. 

40 లక్షల మందికి అవసరం
మన దేశ జనాభాలో దాదాపు 6 శాతం మందికి అంటే.. 8 కోట్ల మందికి కరోనా వైరస్‌ సోకుతుందని అంచనా.. చికిత్సలో భాగంగా ఇందులో కనీసం 40 లక్షల మందికి వెంటిలేటర్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశంలో కేవలం 40 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వచ్చే 10 నెలల్లో మరో 60 వేల వెంటిలేటర్లు మాత్రమే తయారుచేసే సామర్థ్యం మన దేశీయ కంపెనీలకు ఉంది. ఇందుకు దాదాపు రూ.3,600 కోట్లు అవసరం కానున్నాయి. పైగా కంప్యూటర్‌ సాయంతో నడిచే అత్యాధునిక వెంటిలేటర్‌ ధర రూ.40 లక్షల మేర పలుకుతుండగా, సాధారణ రకం విదేశీ వెంటిలేటర్‌కు రూ.15 లక్షల వరకు పలుకుతుండగా, దేశీయ వెంటిలేటర్‌కు రూ.6 లక్షల వరకు ఉంది. 

‘అంబు బ్యాగ్‌’అంటే..
అత్యవసర సమయాల్లో రోగులకు శ్వాస అందించే సంచిలాంటి పరికరాన్ని వైద్య పరిభాషలో అంబ్యు బ్యాగ్‌ అంటారు. దీన్ని విద్యుత్‌ అవసరం లేకుండా చేతి ద్వారానే పనిచేయిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీని డిజైన్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ‘బ్యాగ్‌ వాల్వ్‌ మాస్క్‌’ను తయారుచేయాలని ఐఐటీ హైదరాబాద్‌ సూచిస్తోంది. 60 వేల వెంటిలేటర్ల తయారీకి అయ్యే ఖర్చుతో దాదాపు 60 లక్షల బ్యాగ్‌ వాల్వ్‌ మాస్కులను త యారు చేయొచ్చని చెబుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement