
చిటికీని పరిశీలిస్తున్న అమెరికన్లు
భూదాన్‌పోచంపల్లి(భువనగిరి) : పోచంపల్లిలో శుక్రవారం అమెరికన్లు సందడి చేశారు. రెండు వారాల భారతదేశ పర్యటనలో భాగంగా అమెరికా దేశానికి చెందిన డాక్టర్, లాయర్, జ్వువెల్లరీ డిజైనర్, టీచర్, నర్సు, థెరపిస్ట్‌లు 10 మంది పోచంపల్లిని సందర్శించారు. స్థానిక చేనేత గృహాలను సందర్శించి మగ్గాలు, నూలు, చిటికి కట్టడం, అచ్చు అతకం, రంగులద్దకం, డిజైన్ వేయడం తదితర వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. సంక్లిష్టమైన చేనేతలో ఎంతో నైపుణ్యంతో వస్త్రాలను తయారు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఎంతో ప్రాచీనమైన చేనేత కళను కాపాడుకోవాలని అన్నారు.
స్థానికులతో మమేకమై వారి జీవన విధానాలు, ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ప్రజల ఆదరణ, ఫ్రెండ్లీనేచర్ ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ నోయెల్ మాట్లాడుతూ భారతదేశ పర్యటనలో భాగంగా ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌ను సందర్శించారని తెలిపారు. అంతర్జాతీయ ఇక్కత్‌కు పేరొందిన పోచంపల్లిని సందర్శనకు వచ్చారని అన్నారు. వీరిలో స్టీవెన్‌చాంపెగ్నే, లెస్లీ చాంపెగ్నే, షీరా లబెల్లే, జార్జ్ ఆడమ్స్, మైకెల్ వాల్చ్, జాన్ ఫెంటన్, లిండా ఫెంటన్, సూసాన్ మార్టిన్, బన్నీస్టీన్, ఎలీసన్ కెన్వే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment